-ఈ వృత్తిని చాలెంజ్ గా తీసుకోవాలి
– విద్యార్థులు పాజిటివ్ గా ఆలోచించాలి
-మెడికల్ కాలేజీ విద్యార్థుల ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని
మంగళగిరి, మహానాడు: ప్రజలకు సేవ చేయడానికి దేవుడు ఎంపిక చేసుకున్న సాధనాలే వైద్యులు. అది ఒక్క వైద్యులకు మాత్రమే దక్కిన గౌరవం. ప్రతి రోగి బాధను తన బాధగా భావించగలిగిన నాడు ఒక్క తప్పు కూడా జరగదని రూరల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మంగళగిరి ఎన్నారై మెడికల్ కళాశాల విద్యార్థులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని శనివారం పాల్గొని మాట్లాడారు.
దేశంలో అత్యున్నత స్థాయికి చేరిన వారిలో ఎక్కువ మంది డాక్టర్లుగా కెరియర్ ప్రారంభించిన వారున్నారని, అలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. నేడు ఎన్నో ప్రమాదకర రోగాలు ప్రజలను పీడిస్తున్నాయని, వాటిని అధిగమించడాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలని సూచించారు. జీవితంలో ఫెయిల్యూర్ అనేది మనల్ని బలోపేతం చేసేలా ఉండాలని, దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
విద్యార్థులకు టైమ్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమని, టైమ్ ని మనం మేనేజ్ చేయగలిగితే విజయం వరిస్తుందని, లేదంటే టైమే మనల్ని మేనేజ్ చేస్తుందని పేర్కొన్నారు. తాను తొలిసారి మెడికల్ కాలేజీలో అడుగుపెట్టినప్పుడు అది ఒక ఛాలెంజ్ గా భావించానని పెమ్మసాని గుర్తు చేసుకున్నారు. న్యూ బేసిక్ ఆఫ్ స్టడిబుల్ అవసరమని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ అధికారులతో పాటు వైద్యులు తదితరులు పాల్గొన్నారు.