ఏపీకి ఆక్సిజన్ అందించింది ప్రజలే..

– రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దే వరకు నిద్రపోను
– సీ ప్లేన్ డెమో ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

విజయవాడ, మహానాడు: రాష్ట్రంలో సీ ప్లేన్ రవాణా సౌకర్యం కల్పించడం శుభపరిణామమని.. భవిష్యత్తులో ఎయిర్ పోర్టుల కంటే సీ ప్లేన్ ద్వారా మెరుగైన రవాణా సౌకర్యం లభించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సీ ప్లేన్ ప్రయాణం వినూత్న అవకాశం.. ఇటువంటివి అందిపుచ్చుకోవడం ద్వారా సాంకేతికంగా రాష్ట్రం మరింత ముందుకు సాగుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తు అంతా టూరిజం దేనని సీఎం అన్నారు. ఈ ప్రభుత్వానికి అధికారం అందించడం ద్వారా వెంటిలేటర్ పై ఉన్న ఏపీకి ఆక్సిజన్ అందించిన ఘనత ప్రజలదేనని, వారి నమ్మకం మేరకు మళ్లీ ఏపీని తిరిగి దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేవరకు నిద్రపోనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

విజయవాడలోని పున్నమిఘాట్ లో శనివారం సీ ప్లేన్ డెమో లాంఛ్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం వరకు సీ ప్లేన్ లో సహాచర మంత్రులతో కలిసి ప్రయాణించారు. అనంతరం శ్రీశైలంలో భ్రమరాంబ – మల్లికార్జునస్వామి దర్శనం అనంతరం తిరిగి సీ ప్లేన్ లో తిరిగి విజయవాడకు పయనం అయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర రోడ్లు అండ్‌ భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ కేశినేని శివనాథ్, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఏపీలో మరో నూతన ఆవిష్కరణకు శ్రీకారం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
రాష్ట్ర రోడ్లు అండ్‌ భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, “డ్రోన్ సదస్సుతో ప్రారంభమై.. నేడు సీ ప్లేన్ డెమో కార్యక్రమంతో.. ఆకాశమే హద్దుగా.. ఆంధ్రప్రదేశ్ లో మరో నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టామన్నారు. కూటమి ప్రభుత్వంలో సాంకేతికంగా, పర్యాటకంగా పలు నూతన కార్యక్రమాలు, ఆవిష్కరణలకు వేదికగా నేడు ఆంధ్రప్రదేశ్ మారిందన్నారు. దేశంలోనే వినూత్న కార్యక్రమాలు మా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడానికి మా శాఖకు ముఖ్యమంత్రి ఇస్తున్న ప్రాధాన్యతేనని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రజల మధ్య అనుసంధానమను మెరుగుపరచడానికి ఆంధ్రప్రదేశ్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, ఈ ప్రయత్నంలో విమానయాన రంగం ఒక ముఖ్యమైన భాగమని, రాష్ట్ర ప్రజలు దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలకు సులభంగా చేరుకోవడానికి ఇది వీలు కల్పిస్తుందన్నారు. ప్రయాణికులకు మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని ప్రతి మూలలో ఆర్థిక వృద్ధి, పర్యాటకం, ఉపాధిని పెంచడానికి మేం విమానాశ్రయాలను నిర్మించి, ఆధునీకరిస్తున్నామన్నారు. మా దృష్టి విమానయాన రంగాన్ని విస్తరించడం, ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి జిల్లాకు మెరుగైన విమాన కనెక్టివిటిని పెంపొందించి దాని నుండి ప్రయోజనం పొందేలా చూడటం, భారతదేశ విమానయాన రంగంలో ఆంధ్రప్రదేశను ప్రధాన రాష్ట్రంగా నిలబెట్టడానికి మేం కట్టుబడి ఉన్నామన్నారు.

త్వరలో కుప్పం, దగదర్తి వద్ద కూడా విమానాశ్రాయాలు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. 2023-24 లో, ఈ విమానాశ్రయాల ద్వారా 53.35 లక్షలకు పైగా ప్రయాణించారని, 2024-25 చివరి నాటికి ఈ సంఖ్య 59.10 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం అంతటా సీప్లేన్ సేవలను ప్రవేశపెడుతున్నామని, ఈ ఆవిష్కరణ చొరవతో నీటి విమానాశ్రయాల ద్వారా కీలక పర్యాటక ప్రదేశాలను అనుసందానిస్తుందన్నారు. ప్రకాశం బ్యారేజీ, అరకు, లంబసింగి, రుషికొండ, కాకినాడ, కొనసీమ, శ్రీశైలం, తిరుపతి ప్రభుత్వం గుర్తించిందని, వీటిలో ప్రకాశం బ్యారేజీ, అరకు, రుషికొండ పర్యాటకాన్ని పెంపొందించి, ప్రత్యేకమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా, సీప్లేన్ కోసం డెమో ఫ్లైట్ ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రారంభించబడుతున్నట్టు మంత్రి తెలిపారు. ఇది మన రవాణా పర్యావరణ వ్యవస్థలో నీటి ఆధారిత విమానయానాన్ని ఏకీకృతం చేయడంలో కీలకమైన దశను సూచిస్తుందన్నారు.