రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తో మంచి భవిష్యత్తు

-పదేళ్లుగా ఏమీ చేయలేదనటం అబద్ధం
-కేంద్ర పథకాలు వాడుకుంటూ వైసీపీ దుష్ప్రచారం
-బీజేపీ ఏపీ ఎన్నికల పేరాల చంద్రశేఖర్‌

విజయవాడ, మహానాడు: నరేంద్ర మోదీ నాయకత్యం పదేళ్లుగా ఏమీ చేయలేదని వైసీపీ ప్రభుత్యం అడుగుతోందని దానిని ఖండిస్తున్నట్లు బీజేపీ ఏపీ ఎన్నికల సమన్వయకర్త పేరాల చంద్రశేఖర్‌ తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు లంకా దినకర్‌, ఆర్‌.డి.విల్సన్‌, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ బాజీ తదితరులు పాల్గొన్నారు.

ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను రాష్ట్రం తమ పథకాలుగా చెప్పుకుంటూ తప్పు దారి పట్టిస్తుందన్నారు. అగ్రవర్ణాలలో పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ బిల్లు, బీసీ కమిషన్‌ వల్ల ఆయా వర్గాలకు మేలు జరిగిందన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా 1.22 కోట్ల ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులను అందజేసినట్లు చెప్పారు. చేతి వృత్తుల వారికి రుణాలు, పరికరాలు అందించినట్లు తెలిపారు. 4500 కి.మీ అదనపు హైవే లను నిర్మించడం జరిగిందన్నారు. వైద్య రంగం కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేశామని, 2,60,000 మంది వీధి వ్యాపారులకు రూ.10 వేల చొప్పున అందించినట్లు వివరించారు. ఏపీలో 18 రకాల చేతివృత్తుల వారికి పీఎం విశ్వకర్మ ఉపయోగపడుతుందని తెలిపారు. 23,800 కోట్లు టోటల్‌ గ్రాంట్‌ ఎయిడ్‌ ఇచ్చినట్లు వివరించారు. బీజేపీపై ఆరోపణలు మానుకోవాలని హితవుపలికారు.