హైదరాబాద్ : హోంమంత్రి అమిత్ షాపై మొఘల్‌పురా పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ పార్టీ పీసీసీ వైఎస్ ప్రెసిడెంట్ జి.నిరంజన్ ఢిల్లీలో ఎన్నికల ప్రధానాధికారికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ నెల ఒకటో తేదీన పాతబస్తీ పర్యటన సందర్భంగా అమిత్‌షా చిన్నారుల తో ప్రచారం చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవిలత మాట్లాడే సమయంలో వేదిక కింద ఉన్న బాలికలను అమిత్‌షా తన వద్దకు రమ్మంటూ సైగ చేయడంతో వారు అమిత్ షా వద్దకు వెళ్లారని ఆ సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఈసీ విచారణ జరిపించాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కు ఆదేశించగా కేసు నమోదైంది.