మున్సిపల్ పనితీరులో మార్పు అవసరం

– డంపింగ్ యార్డ్ పరిష్కారానికి 15 రోజుల్లో చర్యలు
– పారిశుద్ధ్య పనులను మరింత వేగవంతం
– నీటి కులాయిల అవసరాలపై సర్వే చేయించండి
– తెనాలి మున్సిపాలిటీ రివ్యూ మీటింగ్ లో కేంద్ర మంత్రి పెమ్మసాని

గుంటూరు, మహానాడు: ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. డాగ్స్(కుక్కలు) సర్జరీలు, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం, నీటి కులాయిల ఏర్పాటు, డంపింగ్ యార్డ్ తొలగింపు తదితరాలపై అధికారులకు నిర్దేశించిన సమయంలో పరిష్కారాలు చూపాలని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.

సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో కలిసి పెమ్మసాని తెనాలి మున్సిపాలిటీ అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా పట్టణంలోని పారిశుద్ధ్య సమస్యలు, డ్రైనేజీ ఇబ్బందులు తదితరాల వివరాలను పెమ్మసాని కమిషనర్ ను అడిగి తెలుసుకున్నారు.

గుంతలు పడ్డ రోడ్డు మరమ్మతు పనులకు టెండర్లు పిలిచి, 15 రోజుల్లో పట్టణంలోని గుంతలు పూడ్చాలని మున్సిపల్ కమిషనర్, అధికారులకు పెమ్మసాని ఆదేశించారు. అలాగే పట్టణంలో నీటి కుళాయిల అవసరం ఎంతమందికి ఉందనేది తెలుసుకునే విధంగా ఒక సర్వే నిర్వహించి వీలైనంత త్వరగా నీటి కుళాయిలను అందజేయాలని సూచించారు.

ప్రమాద భరితంగా డంపింగ్ యార్డ్
తెనాలి పట్టణ శివారులోని డంపింగ్ యార్డ్ కు ఆనుకొని, రహదారికి పక్కనే కొబ్బరి బొండాలు పడేస్తున్నారు. అవి రోడ్లపై కి జారడం వల్ల వాహనదారులు పలు ప్రమాదాలకు గురవుతున్నారు. ఎవరికైనా ప్రాణాల మీదకు వచ్చేదాకా చూస్తుండకూడదని, తక్షణమే టెండర్లు ఖరారు చేసి డంపింగ్ యార్డ్ ను, కొబ్బరి బొండాలను మరో ప్రాంతానికి తరలించాలని ఆదేశించారు.

ప్రభుత్వ ఇతర శాఖల తో రివ్యూ
నియోజకవర్గానికి సంబంధించిన అగ్రికల్చర్, ఆర్ డ బ్ల్యూ ఎస్, ఇరిగేషన్, ఎడ్యుకేషన్, ఐసిడిఎస్, ఎన్ ఆర్ ఈ జీ ఎస్, హౌసింగ్ తదితర శాఖలకు సంబంధించిన అధికారులతోనూ పెమ్మసాని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తదితర సమస్యలపై అధికారులను వివరాలు అడిగారు. అయితే, పూర్తి వివరాలు అందుబాటు లేవని అధికారులు చెప్పగా వీలైనంత త్వరగా ఆ డేటాను అందజేస్తే నిధులను సేకరించి త్వరితగతిన మరుగుదొడ్లు ఇతర సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తామని పెమ్మసాని వివరించారు.

అనంతరం నియోజకవర్గంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అందజేసే సంక్షేమ పథకాలు, నిధులు తదితరాలను అందజేసేలా ప్రయత్నిస్తామని ఈ నేపథ్యంలోనే ఈ సమీక్ష సమావేశాన్ని నిర్వహించామని విలేకరులకు పెమ్మసాని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని గారితో పాటు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, కలెక్టర్ ఎస్, నాగలక్ష్మి, సబ్ కలెక్టర్ సంజయ్ సింహా, తదితరులు పాల్గొన్నారు.