– వైద్య, నీటిసరఫరా, పంచాయతీరాజ్ అధికారుల నుంచి వివరాల సేకరణ
– గుర్లలో క్షేత్రస్థాయి పరిస్థితులపై అధ్యయనం
– జిల్లాలో పర్యటించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్
విజయనగరం: గుర్ల మండల కేంద్రంలో డయేరియా ప్రబలి పలువురి మృతికి దారితీసిన ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విచారణ అధికారి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మంగళవారం జిల్లాలో పర్యటించారు.
కలెక్టర్ కార్యాలయంలో ముందుగా జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్, ఇతర జిల్లా అధికారులతో మాట్లాడి తాగునీరు కలుషితం కావడానికి గల కారణాలు, ఆ గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులు, డయేరియా బాధితులకు అందించిన వైద్య సహాయం తదితర అంశాలపై సమగ్రంగా సమాచారం సేకరించారు. ముఖ్యంగా పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా, వైద్య ఆరోగ్యశాఖల సిబ్బంది క్షేత్రస్థాయిలో యీ ఘటన జరిగిన వెంటనే చేపట్టిన చర్యలపై ఆరా తీశారు.
వైద్య ఆరోగ్య శాఖ ద్వారా వివిధ స్థాయిల్లో గుర్ల మండలంలో అందుబాటులో వున్న వైద్యాధికారులు, సిబ్బంది వివరాలను తెలుసుకొని వారు ఏ విధులు నిర్వహిస్తున్నారనే సమాచారం జిల్లా వైద్య అధికారి డా.ఎస్.భాస్కరరావు ద్వారా తెలుసుకున్నారు. గుర్లలో డయేరియా ప్రబలడానికి ముందే ఆ మండలంలోని పరిసర గ్రామాల్లో నమోదైన డయేరియా కేసుల సమాచారం కూడా తెలుసుకున్నారు.
గుర్లలో డయేరియా కేసులు బయటపడిన వెంటనే వైద్య ఆరోగ్యశాఖ స్పందించిన తీరు, ఆ శాఖ ద్వారా అందించిన వైద్యసహాయం తదితర అంశాలపై ఆరా తీశారు. గుర్లలో మొదట కేసు ఎప్పుడు బయటపడిందీ ఆ తదనంతరం ఎంత వ్యవధిలో వైద్యసహాయం అందించిందీ తదితర వివరాలు తెలుసుకున్నారు. తాగునీటి నాణ్యతపై జరిపిన ల్యాబ్ పరీక్షల్లో డయేరియా వ్యాప్తికి కారణమైన బాక్టీరియా వున్నట్టు తేలిందని డి.ఎం.హెచ్.ఓ. తెలిపారు.
గ్రామంలో తాగునీరు కలుషితం కావడానికి గల కారణాలపై కూడా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆరా తీశారు. తాగునీరు పరీక్షల అనంతరం వచ్చిన ల్యాబ్ రిపోర్టుల ఫలితాలపై ఆరా తీశారు. ఓవర్ హెడ్ ట్యాంకులను క్రమం తప్పకుండా క్లోరినేషన్ చేస్తున్నదీ లేనిదీ తెలుసుకున్నారు. గ్రామంలో అక్టోబరు నెల వర్షపాతం వివరాలపై తహశీల్దార్ ఆదిలక్ష్మి ని అడిగి తెలుసుకున్నారు. ఈ నెలలో పెద్దగా వర్షాలు కురవలేదని ఆమె వివరించారు.
ఎస్.ఎస్.ఆర్.పేట తాగునీటి పథకం నుంచి సరఫరా అయిన నీరు ఏమైనా కలుషితం అయ్యే అవకాశం వుందా అనే అంశంపై గ్రామీణ నీటిసరఫరా ఎస్.ఇ. ఉమాశంకర్ ను ఆరా తీశారు. తాగునీటి పైపులైన్ల లీక్ వల్ల కూడా నీరు కలుషితం అయ్యే అవకాశం వుందని, డ్రెయిన్లలో వున్న పైపులైన్లను వెంటనే తొలగించి వాటిని మార్చాల్సి వుందన్నారు. ఓవర్‌హెడ్ ట్యాంకులను ఎన్ని రోజులకోసారి శుభ్రపరుస్తున్నారనే అంశంపై ప్రశ్నించారు.
ఏ దశలో తాగునీరు కలుషితం అయ్యిందనే విషయంపై గ్రామీణ నీటిసరఫరా అధికారులను ప్రశ్నించారు. గ్రామంలో బహిరంగ మలవిసర్జన జరుగుతున్నట్టు తెలిసిందని, గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లు లేని కుటుంబాలు ఎన్ని ఉన్నాయనే అంశంపై ఆరా తీశారు. గ్రామంలోని 918 కుటుంబాల్లో 180 మందికి మరుగుదొడ్లు లేవని, మరికొన్ని కుటుంబాలకు మరుగుదొడ్లు వున్నా వాటిని ఇతర అవసరాలకు వినియోగిస్తున్నట్టు జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు వివరించారు. గ్రామంలో నిర్మించిన మరుగుదొడ్లను సరైన డిజైన్‌తోనే నిర్మించారా లేదా అనే అంశంపై ఆరా తీశారు.
గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణపై డివిజనల్ పంచాయతీ అధికారి మోహనరావు, గ్రామ పంచాయతీ కార్యదర్శులను ప్రశ్నించారు.
భవిష్యత్తులో గుర్ల వంటి డయేరియా ఘటనలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలను సూచించాలని డి.ఎం.హెచ్.ఓ.ను ఒక నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రజల్లో తగిన అవగాహన కలిగించడం, తాగునీటి వనరులను క్రమం తప్పకుండా క్లోరినేషన్ చేయడం, ప్రజల అలవాట్లలో మార్పు తీసుకురావడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా ప్రోత్సహించడం వంటి చర్యల ద్వారా డయేరియా వ్యాప్తి చెందకుండా నిరోదించవచ్చని పేర్కొన్నారు.
చీపురుపల్లి ఆర్.డి.ఓ. సత్యవాణితో మాట్లాడి డయేరియా ప్రబలిన అంశంపై ఆమె నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్, గ్రామీణ నీటిసరఫరా చీఫ్ ఇంజనీర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.