ప్రాణాలు తీసిన ఇంస్టాగ్రామ్ నకిలీ ఖాతా

స్నేహితుడే మోసం చేశాడని నిలదీత
-మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్య

సత్తెనపల్లి, మహానాడు: ఇంస్టాగ్రామ్ నకిలీ ఖాతాతో ఓ యువకుడు యువతిలా చాటింగ్ చేసి తన స్నేహితుని దగ్గరే నగదు కాజేశాడు. చివరికి నిజం తెలిసి ఆ స్నేహితుడే నిలదీయడంతో మనస్తాపానికి గురై ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో జరిగింది.

వివరాల్లోకి వెళితే… తెనాలికి చెందిన దాసరి భాను ప్రకాష్(19) కుటుంబం సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామానికి కూలి పనుల కోసం వచ్చి ఇక్కడే నివసిస్తున్నారు.  భాను ప్రకాష్ ఇంస్టాగ్రామ్ నకిలీ ఖాతాతో తన స్నేహితునితో యువతిలా చాటింగ్ చేసి దశలవారీగా 30 వేలు నగదు కాజేశాడు. చివరికి నిజం తెలుసుకున్న స్నేహితుడు భాను ప్రకాష్ ను నిలదీశాడు.

స్నేహితుడు నిలదీయడంతో మనస్తాపానికి గురై భానుప్రకాష్ పురుగుమందు తాగి ఆత్మ హత్యాయత్నం చేశాడు. అతడిని సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  భాను ప్రకాష్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.