Mahanaadu-Logo-PNG-Large

కుప్పం ప్రజల నుండి వెల్లువెత్తిన వినతులు

– 4 రోజుల్లో వచ్చిన 977 వినతులు
– అత్యధిక భాగం భూ సమస్యలకు సంబంధించినవే
– ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన భువనేశ్వరి

కుప్పం: కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి 4రోజుల పర్యటన బిజీబిజీగా గడిచింది. బెంగళూరు విమానాశ్రయం నుండి రోడ్డు మార్గంలో వచ్చిన భువనేశ్వరికి కర్ణాటక, ఏపీ సరిహద్దు వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలకడంతో ప్రారంభమైన పర్యటన ఆద్యంతం ఓ పండుగ వాతావరణంలో సాగింది.

మొదటి రోజు గుడిపల్లి మండలం కమ్మగుట్టపల్లి, కంచిబందార్లపల్లి, గుత్తార్లపల్లి, కోటపల్లి గ్రామాల్లో భువనేశ్వరి పర్యటించారు. ప్రజల నుండి వారి సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను భువనేశ్వరి స్వీకరించారు. తొలిరోజు పర్యటనలో భువనేశ్వరికి 202 వినతులు వచ్చాయి.

రెండో రోజు కుప్పం రూరల్ మండలం, ఎన్.కొత్తపల్లి, నడుమూరు, పైపాళ్యం, ఉర్ల ఓబనపల్లి, గుండ్లనాయనపల్లి గ్రామాల్లో భువనేశ్వరి పర్యటించారు. రెండవ రోజు పర్యటనలో 310 వినతులు వచ్చాయి. మూడవ రోజు శాంతిపురం మండలం, సోమాపురం, కర్లగట్ట, బొడుగుమాకులపల్లి అదేవిధంగా రామకుప్పం మండలం, ఆవులకుప్పం, నారాయణపురం తండా, ఆరిమానిపెంట, వీర్నమల గ్రామాల్లో పర్యటించారు.

మూడవ రోజు పర్యటనలో 345 వినతిపత్రాలు వచ్చాయి. నాల్గవ రోజు కుప్పం టౌన్ లో పర్యటించారు. ఈ సందర్భంగా టౌన్ ప్రజలు తమ సమస్యలపై భువనేశ్వరికి వినతిపత్రాలు అందించారు. భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో 4రోజుల పర్యటనలో వచ్చిన వినతులతో కలిపి రమారమి 977 వినతులు వచ్చాయి. వీటిని శాఖల వారీగా విభజించి, ప్రతి వినతిపత్రాన్ని సంబంధిత శాఖ అధికారులకు పంపించి సత్వర పరిష్కారానికి భువనేశ్వరి కోరనున్నారు.

877 వినతుల్లో అత్యధిక భాగం భూ సమస్యలు, జగన్ పాలనలో రద్దు చేసిన సంక్షేమ పథకాలకు సంబంధించినవే ఎక్కువగా ఉండడం గమనార్హం. భువనేశ్వరి పర్యటించిన ప్రతి గ్రామంలోనూ వైసీపీ పాలనలో చోటుచేసుకున్న భూ సమస్యలు, సంక్షేమ పథకాలు నిలిపేసిన వేధింపులు వినతుల రూపంలో భువనేశ్వరికి అందాయి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని భువనేశ్వరి అర్జీదారులకు భరోసా కల్పించారు.