– వివిధ అభివృద్ధి పనుల పరిశీలన
చిరుమామిళ్ళ, మహానాడు: కేంద్రం ఆర్ధిక మంత్రిత్వ శాఖలోని ఆర్ధిక వ్యవహారాల విభాగం సంయుక్త కార్యదర్శి, సీనియర్ ఐఎఎస్ అధికారి సొలొమోన్ ఆరోకీయా రాజ్ మండలంలోని ఆదర్శ గ్రామం చిరుమామిళ్ళలో పర్యటించారు. జలశక్తి అభియాన్ కింద జలజీవన్ మిషన్ పతకం ద్వారా గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి పనులను సొలొమోన్ ఆరోకీయా రాజ్ సారథ్యంలోని కేంద్ర స్థాయి అధికారుల బృందం పరిశీలించింది. ఇందులో భాగంగా లింగారావుపాలెం రోడ్డులో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు (మంచి నీటి చెరువు) వద్దకు చేరుకుని జలజీవన్ మిషన్ ద్వారా చేపట్టిన పనులను ఆరా తీశారు.
చెరువు రక్షణ కొరకు ఇనుప కంచె ఏర్పాటు చేసినట్లు అధికారులు వారికి తెలిపారు. చెరువు విస్తీర్ణం, పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం, గ్రామంలో ఉన్న మొత్తం జనాభా వివరాలను సొలొమోన్ ఆరోకీయా రాజ్ అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటుగా గ్రామంలో మైక్రో ఫిల్టర్, ఫిల్టర్ ఫ్లాట్ఫారం, హెడ్ వర్క్స్ దగ్గర పుంపు సెట్లు వంటివి ఈ పథకం కింద చేపట్టి వాటిని పూర్తి చేసినట్టు అధికారులు వివరించారు.
అనంతరం ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్న ప్రాంగణంలో అధికారుల బృందం మొక్కలు నాటారు. ఆ తరువాత స్థానిక గ్రామ సచివాలయంలో గ్రామ మంచి నీటి పారిశుద్ధ్య కమిటీ సభ్యులు, గ్రామస్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని కమిటీ సభ్యుల చేత నీటి నాణ్యత పరీక్షలు కూడా చేయించారు.
గ్రామస్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సొలొమోన్ ఆరోకీయా రాజ్ తో పాటుగా కేంద్ర భూగర్భ,జల వనరుల శాఖఉన్నతాధికారి మాధవ్, జలజీవన్ మిషన్ జిల్లా అధికారి ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజినీర్ కిరణ్ కుమార్, సురేష్, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ జోసఫ్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ ఏడుకొండలు, ఎంపీడీవో షేక్ జాకీర్ హుస్సేన్, ఏపీవో పుష్పరాజు, ఎపిఎం సాంబశివరావు, పంచాయతీ కార్యదర్శి అల్లడి స్వాతి, టీఏ ముత్యాల రాజు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసరావు, జిల్లా కో ఆర్డినేటర్ రంగారావు, ఆర్డబ్ల్యూఎస్ జేఈ సూర్య తేజ, తదితరులు పాల్గొన్నారు.