ఖజానాకు లిక్కర్ కిక్కు

– మళ్లీ మద్యం ధరలకు రెక్కలు?
-మందు బాదుడుకు సర్కారు సిద్ధం
– బ్రూవరీల కోరిక మన్నించనున్న రేవంత్ సర్కారు
– దసరా అమ్మకాలతో ఖజానాకు కిక్కే కిక్కు

హైదరాబాద్: తెలంగాణ సర్కారు మందుబాదుడుకు సిద్ధమవుతోంది. ఖజానా కిక్కు కోసం మందుబాబులపై భారం వేసేందుకు రెడీ అవుతోంది. బ్రూవరీల కోరికను మన్నించడం ద్వారా, మందుధరలు పెంచి ఖజానాను పరిపుష్ఠం చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం కూడా అందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ధరలు 15 శాతం వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ఆర్ధిక కష్టాల్లో ఉన్న సర్కారును మందుబాబులు ప్రతిసారీ ఆదుకుంటున్నారు. ఇప్పుడు అప్పులతోతమతమవుతున్న రేవంత్‌రెడ్డి సర్కారును మరోసారి మందుబాబులు ఆదుకోనున్నారు. అంటే మళ్లీ మద్యం ధరలకు రెక్కలు రానున్నాయన్నమాట. మద్యం ధరలు పెంచాలని బ్రూవరీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

ప్రభుత్వం ధరలను ప్రతి రెండేళ్లకోసారి పెంచుతుంది. వివిధ రకాల మద్యంపై రూ.20 నుంచి రూ.150 వరకు పెంచాలని బ్రూవరీలు ప్రభుత్వాన్ని కోరాయి. తెలంగాణలోని 6 బ్రూవరీల్లో ప్రతి సంవత్సరం 88 కోట్ల లీటర్ల బీరు ఉత్పత్తి అవుతోంది. దసరా పండుగ సమయంలో మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతాయి. ఈసారి పది రోజుల వ్యవధిలో రూ.1,100 కోట్లకు పైగా మద్యాన్ని తెలంగాణ మందుబాబులు తాగేశారు.

మద్యం అమ్మకాల్లో ఈసారి కూడా హైదరాబాద్ ముందు నిలిచింది. సెప్టెంబర్ 30 వరకు రూ.2,838 కోట్ల మద్యం అమ్మకాలు జరగగా… అక్టోబర్ నెల ప్రారంభం నుంచి 11వ తేదీ వరకు రూ రూ.1,100 కోట్ల విలువైన 10 లక్షల 44 వేల కేసుల మద్యం అమ్మకాలు జరిగాయని ఆబ్కారీ అధికారులు చెబుతున్నారు. 10 రోజుల వ్యవధిలో 17 లక్షల 59 వేల బీర్లు అమ్ముడుపోయినట్లుగా తెలుస్తోంది. ఇదే కిక్కుతో మద్యంపై బాదుడు ద్వారా మరిన్ని వేల కోట్ల రూపాయల ఆదాయానికి రేవంత్ సర్కారు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.