ప్రజలు మెచ్చే పాలన ఆరంభమైంది 

కూటమి పాలనలో విద్యా వ్యవస్థకు నూతనోత్తేజం
భరతమాత ముద్దు బిడ్డల పేర్లతో నూతన పథకాలకు శ్రీకారం
ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు 

నరసరావుపేట, మహానాడు:   ప్రజలకు ఏం కావాలో, రాష్ట్రాభివృద్ధికి ఏం చేయాలో ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు జగన్ రెడ్డి పెట్టిన పేర్లను తొలగించి భరతమాత ముద్దు బిడ్డల పేర్లతో నూతన పథకాలు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. నాడు నేడు అంటూ జగన్ రెడ్డి పిల్లల చదువుల పై కూడా రాజకీయం చేశాడని ధ్వజమెత్తారు.

పిల్లలు చదువుకునే పుస్తకాలపై కూడా జగన్ రెడ్డి లాంటి ఆర్ధిక నేరస్తుడి ఫోటోలు ముద్రించడం అత్యంత దుర్మార్గమన్నారు. అందుకే జగన్ రెడ్డి తీసుకున్న మూర్ఖపు నిర్ణయాలన్నింటినీ ప్రక్షాళన చేస్తున్నామన్నారు. దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన అబ్దుల్ కలాం, ఆకలి తీర్చిన డొక్కా సీతమ్మ, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మహనీయులతో పథకాలు అందించబోతున్నట్లు తెలిపారు.

జగన్ రెడ్డి ఫోటో, పేర్లు పెట్టడం ద్వారా పిల్లలకు ఏం సందేశం ఇవ్వదలిచారో వారికే తెలియాలని ఎద్దేవా చేశారు. ఈ మేరకు అమ్మఒడి పథకాన్ని ‘తల్లికి వందనం’గా, విద్యాకానుకకు ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’గా, గోరుముద్ద పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా, నాడు-నేడు పేరును ‘మన బడి- మన భవిష్యత్తు’గా, స్వేచ్ఛ పథకాన్ని ‘బాలికా రక్ష పథకం’గా, ఆణిముత్యాల పేరును ‘అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం’గా మార్చుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. దేశం కోసం పోరాడిన వారి పేర్లను గుర్తుచేసుకోవడం మన బాధ్యత అని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవిందబాబు కొనియాడారు.