శ్రీచైతన్య ఏవోపై చాకుతో విద్యార్థి దాడి!

– గొంతులోకి దిగిన చాకు
– ఫీజు చెల్లించలేదని విద్యార్థికి బూతులతో తిట్లు!
– సగం చెల్లించినా 80 శాతం కట్టాలని ఏవో డిమాండ్‌
– సంక్రాంతి తర్వాత మొత్తం కడతామని విన్నపం
– అయినా అందరి ముందు ఎగతాళి
– హాస్టల్‌లోకి వెళ్ళనీయకుండా అరగంట పాటు క్యాంపస్‌లో నిలబెట్టిన వైనం
– ఆగ్రహం పట్టలేక దాడి
– పోలీసుల అదుపులో ఇంటర్‌ విద్యార్థి
– తిరుచానూరు జూ.కాలేజ్ లో ఘటన

తిరుపతి, మహానాడు: తిరుచానూరు శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ లో ఏవోపై విద్యార్థి చాకుతో దాడికి పాల్పడ్డాడు. చాకు ఏవో గొంతులోకి దిగింది. ఈ ఘటనకు పాల్పడ్డిన విద్యార్థి ఇంటర్ మెదటి సంవత్సరం చదువుతున్నాడని, దసరా సెలవులకు వెళ్లి ఆదివారం సాయంత్రం వచ్చాడని యాజమాన్యం తెలిపింది. కాలేజ్ ఫీజు బకాయి విషయంలో అందరి ముందు ఏవో ఎగతాళి చేశాడని దీంతో విద్యార్థి ఆగ్రహంతో దాడి చేశాడని తెలుస్తోంది. విద్యార్థి సగానికిపైగా ఫీజు చెల్లించాడని, 80 శాతం ఫీజు కట్టాలని ఏవో డిమాండ్‌ చేస్తూ బాధిత విద్యార్థిని హాస్టల్‌లోకి వెళ్ళనీయకుండా అరగంట పాటు క్యాంపస్‌లో నిలబెట్టినట్టు సమాచారం.

సంక్రాంతి సెలవుల్లో మొత్తం చెల్లిస్తామని చెప్పినా వినకుండా బూతులు తిడుతూ విద్యార్థిని వేధించడంతో పండ్లు కోయడానికి ఇంటి నుంచి తెచ్చుకున్న చాకుతో విద్యార్థి ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా, విద్యార్థి మానసిక స్థితి బాగాలేదంటూ యాజమాన్యం ప్రచారం చేస్తోందని, నాలుగు సార్లు సూసైడ్ కు ప్రయత్నించాడంటూ పోలీసులకు చెప్పినట్టు పలువురు అంటున్నారు. కాగా, ఆ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.