– రాచరికపు పోకడలకు స్వస్తి పలుకుతూ అదేశాలు జారీ చేసిన ఆర్ పి సిసోడియా
– న్యాయస్థానాలలో న్యాయమూర్తి తరహాలో కూర్చునే విధానానికి చెల్లుచీటి
– ఎత్తైన పోడియం, ప్రత్యేకంగా ఉండే కుర్చీ, అడ్డుగా ఎర్రని వస్త్రం ఇక కనిపించవు
– కొనుగోలు, అమ్మకం దారులకు తగిన గౌరవం లభించేలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
– సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాలు ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండేలా ప్రభుత్వ అదేశాలు
అమరావతి : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇకపై రాజరికపు పొకడలు కనిపించవు. న్యాయస్ధానాలలో న్యాయమూర్తుల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చొనే విధానానికి చెల్లు చీటి పలికేలా రిజిస్ట్రేషన్‌ల శాఖ నిర్ణయం తీసుకుంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపు రేఖల మార్పుకు సంబంధించి రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తాజా అదేశాలు జారీ చేశారు.
ప్రజలకు చేరువగా పరిపాలన ఉండాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు ఆంకాక్షల మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తీసుకున్నఈ కీలక నిర్ణయం ఫలితంగా ఇప్పటి వరకు రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉన్న విధానాలను సమూలంగా మార్చినట్లు అయ్యింది.
ప్రస్తుత విధానం అమర్యాదకరంగా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అంతరం పెంచేలా ఉందన్న విషయాన్ని గుర్తించిన రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ విధానం మార్పుకు శ్రీకారం చుట్టారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నట్టుగానే సబ్ రిజిస్ట్రార్లు కూర్చునే అమరిక ఉండేలని సిసోడియా ఇచ్చిన ఆదేశాలు ఇప్పటికే అమలవుతున్నాయి.
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమీషనర్ శేషగరి బాబు ఇప్పటికే ఆ పనిలో ఉన్నారు. రెండు రోజులు సెలవు దినాలు రావటంతో మంగళవారం నాటికే కొత్త రూపుతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కనిపించేలా వేగవంతమైన చర్యలు చేపట్టారు.
సబ్ రిజిస్ట్రార్లు కూడా సామాన్యులేననే భావన కలిగేలా రెవెన్యూ శాఖ చేపట్టిన కసరత్తు మంచి ఫలితాలను ఇస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. సబ్ రిజిస్ట్రార్‌కు ప్రత్యేక ఎత్తైన పోడియం, బల్ల చుట్టూ ఉండే ఎర్రని వస్ర్త్రం క్లాత్ కనిపించవు. సబ్ రిజిస్ట్రార్ కుర్చీ సైతం సగటు అధికారి మాదిరే ఉంటుంది. కుర్చీ, బల్లకు ప్రత్యేక వేదిక ఉండదు.
నేల ఎత్తులోనే అవి ఉండాలని, చుట్టూ ఎలాంటి పార్టిషన్ ఉండకూడదని సిసోడియా స్పష్టమైన అదేశాలు ఇచ్చారు. దీంతో సబ్‌రిజిస్ర్టార్‌కి ప్రజలకు మధ్య టేబుల్‌తప్ప మరేమీ అడ్డంగా ఉండదు. రిజిస్ర్టేషన్ కోసం వచ్చిన ప్రజలు, వారి కంటే ఎత్తులో ఉన్న సబ్‌రిజిస్ర్టార్ పోడియం ముందు నిలబడి రిజిస్ర్టేషన్ ప్రక్రియ పూర్తి చేయటం ఇప్పటి వరకు అమలులో ఉన్న విధానం.
భూములు రిజిస్ట్రేషన్‌ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుండగా, సామాన్య ప్రజలకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అత్యధిక గౌరవం దక్కాలన్నది ప్రభుత్వ భావనగా ఉంది. సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాలు ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండేలా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది.
సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాల్లో తగిన మర్యాదలు ఇవ్వాలని మెమో జారీ అయ్యంది. సబ్‌రిజిస్ర్టార్ ముందు సరిపడా కుర్చీలు అందుబాటులో ఉంచడం ద్వారా రిజిస్ర్టేషన్‌కి వచ్చిన ప్రజలు కూర్చుని రిజిస్ర్టేషన్ ప్రక్రియ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తాజా ఆదేశాల ఫలితంగా రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యే వరకు కొనుగోలు, అమ్మకం దారులు నిలబడవలసిన అవసరం ఉందబోదు.
లావాదేవీల సమయంలో సబ్ రిజిస్ట్రార్ సమక్షంలో కూర్చునే పని పూర్తి చేయించుకోవచ్చు. ఇటీవల సిసోడియా, రెవెన్యూ, రిజిస్ర్టేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాలకు వెళ్లి పరిశీలించారు. క్షేత్రస్థాయి పర్యటనలు నేపథ్యంలో అక్కడి బ్రిటీష్ పోకడలను గుర్తించి మార్పులు తప్పనిసరని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.