Mahanaadu-Logo-PNG-Large

ఆసుపత్రిలో ప్రతి తల్లి,బిడ్డకు ట్యాగ్‌ తప్పనిసరి

గుత్తేదారుడు బాధ్యతగా పనిచేయాలి
జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ కిరణ్‌కుమార్‌

గుంటూరు: ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి, బిడ్డకు ప్రతిరోజూ ట్యాగ్‌ తప్పనిసరిగా ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ చెప్పారు. సోమవారం నవ జాత శిశువుల దొంగతనాన్ని నిరోధించే (ఆర్‌ఎఫ్‌ఐడీ) కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.

అనంతరం బాలింతల వార్డును కూడా తనిఖీ చేశారు. తనిఖీల్లో అనేకమంది తల్లి,బిడ్డలకు ట్యాగ్‌ లేకపోవడాన్ని గుర్తించినట్లు చెప్పారు. కేవలం కంటి తుడుపుగా గుత్తేదారుడు పనిచేస్తున్నట్లు కనపడుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్కో వార్డులో 25 నుంచి 30 మంది బాలింతలు ఉండగా అందులో కేవలం అయిదారు మందికి మాత్రమే ట్యాగ్‌ను అమరుస్తున్నట్లు చెప్పారు. కాన్పు అయిన ప్రతి బాలింతకు, బిడ్డకు ట్యాగ్‌ను అమర్చాల్సిన అవసరం ఉందన్నారు. లేకుంటే పిల్లలు అపహరణకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.

గుత్తేదారుడికి పలుమార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పని చేసే సిబ్బంది కేవలం ఒక్కరు మాత్రమే ఉన్నారని మూడు షిఫ్ట్‌లలో ముగ్గురిని నియమించకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదురవు తున్నాయని తెలిపారు. దీనివల్ల సాయంత్రం, రాత్రి సమయాల్లో పిల్లల సంరక్షణకు సరైన చర్యలు తీసుకోలేకపోతున్నారని చెప్పారు. తల్లి,బిడ్డకు ట్యాగ్‌ తీసి పెట్టుకునే విధంగా కాకుండా లాక్‌ పడే విధంగా ట్యాగ్‌ను కట్టుదిట్టంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని గుత్తేదారుడికి నోటీసులు పంపించినట్లు వివరించారు.