తుర్కపల్లి నుంచి కొండగట్టు వరకూ నీరా‘జనం’
హైదరాబాద్: ఎన్నికల్లో విజయానంతరం ఉప ముఖ్యమంత్రి హోదాలో కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దర్శనానికి బయలుదేరిన పవన్ కళ్యాణ్ కి తెలంగాణలో జనసేన శ్రేణులు అడుగడుగునా ఘన స్వాగతం పలికాయి. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద గుమ్మడికాయలతో దిష్టి తీసి హారతులు ఇచ్చి సాగనంపారు.
తుర్కపల్లి, శామీర్ పేట, సిద్ధిపేట, కరీంనగర్, గంగాధర తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ శ్రేణులు గజమాలలతో స్వాగతించారు. పవన్ కళ్యాణ్ విజయానికి చిహ్నంగా తల్వార్ బహూకరించి జేజేలు పలికారు. పవన్ కళ్యాణ్ రాకతో కొండగట్టు ప్రాంతం అంతా పార్టీ శ్రేణులు అభిమానులతో కిటకిటలాడింది.
ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగారు. పార్టీ ఉపాధ్యక్షులు బి. మహేందర్ రెడ్డి, తెలంగాణ ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్, పార్టీ నాయకులు సాగర్, ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, రాధారం రాజలింగం, వై.నగేష్, సంపత్ నాయక్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.