Mahanaadu-Logo-PNG-Large

‘రాజ్యం’తో పోరాడిన విజేత ఏబీవీ

– పోరాడి.. రి‘టైరయ్యారు’!
– సీఎంకు సెల్యూట్ కొట్టని తొలి ఐపిఎస్‌గా రికార్డు
– ఐదేళ్లూ న్యాయపోరాటంతోనే సరి
– అన్ని కోర్టుల్లోనూ జగన్ సర్కారుది అదే ఆవుకథ
– ఏబీకి వ్యతిరేకంగా ఒక్క కాగితం కూడా చూపలేని జగన్ సర్కారు
– ఏబీవీపై వేధింపులో జగన్ సక్సెస్
– జస్టిస్ రమణ హయాంలోనూ అందని న్యాయం
– ఏబీవీ రిటైర్మెంట్‌లో వింత అనుభవం
– ఉదయం పోస్టింగ్.. సాయంత్రానికి రిటైర్మెంట్
– తరలివచ్చిన బెజవాడ జనం
– భుజాలపై మోసుకుని గౌరవ వీడ్కోలు
– క్రికెట్ మైదానంలా మారిన బెజవాడ ప్రింటింగ్ స్టేషనరీ ప్రాంగణం
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘రాజ్యం’ అనుగ్రహిస్తే అనర్హులను కూడా అందలమెక్కిస్తుంది. ఆగ్రహిస్తే ఎంతటివారినైనా అధ:పాతాళానికి తొక్కేస్తుంది. అందుకే దానితో పోరాడటం కష్టం. జగమొండి అయితేనే, రాజ్యంతో చివరాఖరివరకూ పోరాడి ఫలితం అంతుచూస్తారు. కానీ విజయలక్ష్మి వరించేది కొందరినే. ఆ కొందరికే ప్రజాభిమానం

వెల్లువెత్తుతుంది. ప్రజలు గుండెలో పెట్టుకుని అభిమానిస్తారు. వారి శాఖలో హీరోలవుతారు. అంటే అంతమంది.. ‘రాజ్యం’ నియంత వైఖరిని వ్యతిరేకిస్తార్నన్నమాట! ఇప్పుడు తెలుగునాట సరిగ్గా అదే జరిగింది. అందుకే ఆ పోరాట ప్రస్థాన ప్రస్తావన.

ప్రభుత్వం తలచుకుంటే ఏదైనా చేస్తుంది. ఇష్టం ఉంటే అన్నా అని అప్యాయంగా తలమీద పెట్టుకుంటుంది. ఇష్టం లేకపోతే విసిరి నేలమీద కొడుతుంది. అందుకు నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లంకా వెంకట సుబ్రమణ్యం అయినా ఒకటే.. ఇప్పుడు ఆలూరి బాల వెంకటేశ్వరరావు అయినా ఒక్కటే. హూదాలే వేరు. మిగిలిన అవమానాలు మాత్రం సేమ్ టు సేమ్! ఎల్వీఎస్‌ను తొలిరోజుల్లో

‘ఎల్వీ అన్నా’ అని నోరారా పిలిచిన ప్రభుత్వాధినేత జగన్.. ‘ఎల్వీ అన్న’లోని ముక్కుసూటితనాన్ని మాత్రం భరించలేకపోయారు. దేవాలయాల్లో పనిచేసే అన్యమతస్థుల లెక్క తేల్చాలని, ‘ఎల్వీ అన్న’ ఇచ్చిన ఆదేశాలతో జగన్ సారుకి ఎక్కడో కాలింది. హాయిగా కడుపులో చల్ల కదలకుండా, గుళ్లలో ఉద్యోగాలు చేసుకుంటున్న క్రైస్తవుల కిందకు, ‘ఎల్వీ అన్న’ నీళ్లు తెచ్చేయడాన్ని జగనన్న భరించలేకపోయారు.

దానితో ‘ఎల్వీ అన్న’ సీఎస్ పదవికి నీళ్లొదులుకున్నారు. ‘అమరావతి నుంచి బాపట్ల బాట’లో నడిచి సెలవుపై వెళ్లాల్సి వచ్చింది. అంతకుముందు వరకూ ఆయన ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు. అన్యాయం జరిగిన ఎంతోమంది ఐఏఎస్ అధికారుల సమస్యలను సీఎస్‌ల దృష్టికి తీసుకువెళ్లి, న్యాయం చేసిన ఆయనకు అన్యాయం జరిగితే ఒక్క ఐఏఎస్ స్పందించలేదు. ఐఏఎస్ సంఘమూ కిమ్మనలేదు. దానితో ఎల్వీ అన్న ఉద్యోగ ప్రస్థానం మళ్లీ విధుల్లో చేరకుండానే ముగిసిపోయింది.

ఇప్పుడు ఆలూరి బాల వెంకటేశ్వరరావు అంటే ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం భిన్నమయినప్పటికీ… అవమానం మాత్రం సేమ్ టు సేమ్. ఐదేళ్లలో రెండుసార్లు ఒకే కారణంపై సస్పెండయిన ఏబీవీ, అన్ని కోర్టుల్లోనూ విజయం సాధించారు. అయినా జగన్ సర్కారు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లాయర్లకు పప్పుబెల్లాల్లా పంచి, ఆ కేసును తెలుగు టీవీ జీడిపాకం సీరియళ్లనూ సిగ్గుపడేలా చేశాయి.

చివరాఖరకు క్యాట్ కూడా సర్కారుకు వ్యతిరేక తీర్పే ఇచ్చింది. దానితో రిటైరయ్యే రోజునే పోస్టింగ్.. అదేరోజు సాయంత్రానికి రిటైర్మెంట్ కావాల్సి వచ్చింది. అప్పటికి జగనన్న ఏబీ మీద దయ

చూపినట్లే లెక్క! అఫ్‌కోర్స్… సీఎస్ కూడా రాబోయే రోజుల్లో తనకు దక్కే ఇలాంటి గౌరవాన్ని ముందుగానే కనిపెట్టి, ఏబీ పట్ల రిటైర్మెంట్ రోజున భయంతోనే దొడ్డ మనసు చూపారన్నది అధికార వర్గాల ముచ్చట. ఏదైతేనేం… ఒక ముఖ్యమంత్రిని నేరుగా కలిసి, సెల్యూట్ చేయని ఏకైక ఐపిఎస్ అధికారిగా ఏబీవీ చరిత్రలో నిలిచిపోయారు.

జనం కూడా ఆయనకు పోస్టింగ్ ఇచ్చిన ఆఫీసుకు వందల సంఖ్యలో వెళ్లి, ఏబీవీని తమ భుజాలపై మోసుకుని బయట వరకూ తీసుకువెళ్లారు. ఆయన కూడా వారి అభిమానానికి ఉక్కిరిబిక్కిరయ్యారు. అది వేరే ముచ్చట. ఇలాంటి అరైదున గౌరవం క్రికెటర్లకు మాత్రమే దక్కుతుంటుంది. సెంచరీలు, వికెట్లతో తమ జట్టుకు కప్ అందించిన క్రికెటర్‌ను మాత్రమే అభిమానులు, అలా తమ భుజాల మీద మోసే దృశ్యాలు చూస్తుంటాం. ఇలా ఒక అధికారికి భుజాలపై నీరాజనం పట్టిన దృశ్యం మాత్రం బెజవాడలోనే చూశాం. అలా ఏబీ చివరగా కొలువుదీరిన ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కార్యాలయం, చిన్న పాటి క్రీడామైదానంగా మారిపోయింది.

సరే. అంతా బాగానే ఉంది. ఏబీ పోరాడి పోస్టింగు తెచ్చుకుని రిటైరయ్యారు. ఆయన సస్పెన్షన్ కాలంలో రావలసిన వేతన బకాయిలు కూడా ఎలాగూ ఇచ్చేస్తారు. హ్యాపీ. ఒక ఉద్యోగికి సర్వీసులోనే రిటైర వడం కంటే కావలసింది ఏం ఉంటుంది? దాన్నలా పక్కనపెడితే.. కొద్దిరోజులు మినహాయిస్తే, మిగిలిన ఐదేళ్లూ ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా, బాధ్యతలు అప్పగించాలని అభ్యర్ధించినా, అప్పచెప్పకుండా ఐదేళ్ల జీతం ఉత్తిగా ఇచ్చి, ప్రజాధనం దుర్వినియోగం చేసిన జగన్ సర్కారును ఎవరు శిక్షిస్తారు?

ఏబీవీకి పోస్టింగ్ దక్కకుండా ఐదేళ్లపాటు హైకోర్టు- సుప్రీంకోర్టులో బయటి రాష్ట్రాల లాయర్లకు కోట్ల రూపాయలిచ్చి, కేసును సాగదీసిన ప్రభుత్వం.. చివరాఖరకు హైకోర్టులో తలవంచింది. మరి ఏబీకి వ్యతిరేకంగా వెచ్చించిన ఆ ప్రజాధనాన్ని ఎలా రికవరీ చేస్తారు? అటు సర్కారుకు ఎంత ఖర్చయి ఉంటుందో, ఇటు బాధితుడు ఏబీకి సైతం అంతే ఖర్చయి ఉండాలి. మరి ఆ ఖర్చు ఎవరిస్తారు? ఈ మధ్యకాలంలో పడిన మానసిక వేదన-సంఘర్షణ సంగతేమిటి? అసలు నెలలపాటు సుప్రీంకోర్టులో బెంచ్‌మీదకు సైతం రాకుండా, ఈ కేసును ఏ అదృశ్య శక్తులు అడ్డుకున్నాయి?

అన్నట్లు ఏబీ కులానికే చెందిన జస్టిస్ ఎన్వీ రమణ, అప్పట్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్నందున.. ‘మీది తెనాలి మాది తెనాలి’ సూత్రం ప్రకారం, ఏబీవీ కేసు త్వరగా తెమిలిపోతుందని చాలామంది భ్రమపడ్డారు. కానీ విచిత్రంగా ఆయన సీజేగా ఉన్న కాలంలో, అసలు ఏబీ కేసు బెంచిమీదకు రాకపోవడమే విచిత్రం.

ఒక సీనియర్ ఐపిఎస్ అధికారికే సత్వర న్యాయం దిక్కులేకపోతే, ఇక సామాన్యుడి సం‘గతే’మిటి? కోర్టు ఉత్తర్వును అమలుచేయని సీఎస్‌లకు శిక్ష విధించేది ఎవరు? విచారణ సమయంలో తప్పుడు నివేదికలు ఇచ్చిన ఐపిఎస్‌లను శిక్షించేది ఎవరు? సీఎంఓ నుంచే అర్థరాత్రి అసత్యాలు పంపిణీ చేసిన వారికి శిక్ష ఏదీ? ఇష్టానుసారం ఆరోపణలు చేసి, వ్యక్తిత్వ హననానికి పాల్పడిన టీవీ-పత్రికలకు శిక్ష ఏదీ?

అసలు ఇష్టం లేని అధికారులపై పాలకులు వేసే సస్పెన్షన్ నిందల, ‘విచక్షణాధికారా’న్ని న్యాయవ్యవస్థ ఎందుకు రద్దు చేయదు. ఐదేళ్లు ఉండే ప్రభుత్వాలకు, 30 ఏళ్ల సర్వీసున్న అధికారిపై విచక్షణాధికారం ఎందుకు ఉండాలి? మొన్న ఎల్వీ.. నిన్న ఏబీ.. రేపు ఇంకెవరు? ఇందులో ఎల్వీని సస్పెండ్ చేయకపోవచ్చు. అవమానకరంగా బదిలీ అయితే చేశారు కదా? ప్రశ్నించడమే నేరమైతే, ఇక రాజ్యం వీరభోజ్యమే అవుతుంది కదా! న్యాయవ్యవస్థ నుంచి, సామాన్యుడికి ‘సత్వరన్యాయం’ ఇక కల్లేనా? దీనిని ప్రశ్నించి న్యాయస్థానాల్లో పోరాడే మొనగాడెవరు?… మరి బాధితుడయిన ఏబీవీ ఆ మొనగాడవుతారా?