అనుకున్న లక్ష్యాలను సాధించండి

– గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్‌ నసీర్‌

గుంటూరు, మహానాడు: విద్యార్థులందరూ అనుకున్న లక్ష్యాలను సాధించాలని గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్‌ నసీర్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యూత్‌ ఫెస్టివల్‌ కాంపిటీషన్స్‌ను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి యువజనోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన స్వామి వివేకానందను స్మరించుకుంటూ ఈ యువజనోత్సవాలను నిర్వహించడం చాలా సంతోషమన్నారు. విద్యార్థులందరూ ఆట పాటల్లో పాల్గొంటూ ఫిజికల్, మెంటల్‌ ఫిట్‌నెస్‌ను పెంపొందించుకోవాలన్నారు. ప్రభుత్వం విద్యార్థులను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లుగా ప్రోత్సహించడానికి కావలసిన ఇంటర్న్‌షిప్‌లు కూడా అందిస్తుందని తెలియజేసారు.

విద్యార్థుల ఫిట్‌నెస్‌ కోసం ప్రభుత్వాలు ప్రత్యేకమైన పాలసీ తీసుకురావాలని విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య అన్నారు. విద్యార్థులందరూ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. విద్యార్థులందరకీ చిన్న వయసు నుంచే ఫిజికల్‌ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యతనిచ్చి స్పోర్ట్స్, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వంటి కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్‌ ప్రత్యూష సుబ్బారావు, స్టెప్‌ సీఈవో టి.విజయలక్ష్మి, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.