అనంతపురం ఏఆర్‌ అదనపు ఎస్పీపై వేటు

-తాడిపత్రి అల్లర్లపై పొంతన లేని జవాబులు
-ఎస్పీ నివేదికతో రేంజ్‌ డీఐజీ చర్యలు

అమరావతి, మహానాడు: అనంతపురం ఏఆర్‌ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డిపై వేటు పడింది. డీజీపీ కార్యాలయానికి సరెండర్‌ చేశారు. తాడిపత్రిలో అల్లర్ల వేళ అదనపు బలగాలు కావాలని పూర్వ ఎస్పీ అమిత్‌ బర్దర్‌ కోరగా లక్ష్మీనారాయణరెడ్డి బాధ్యతారాహి త్యంగా వ్యవహరించినట్లు సమాచారం. అదనపు బలగాలు లేకపోవడంతోనే అల్లర్లు పెరిగాయని అమిత్‌ బర్దర్‌ నివేదించారు. అమిత్‌ బర్దర్‌పై ఎన్నికల సంఘం వేటు వేసిన తర్వాత ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గౌతమి సాలి తాడిపత్రి ఘటనల వైఫల్యాన్ని లోతుగా పరిశీలన చేస్తున్నారు. ఏఆర్‌ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డిని పిలిచి వివరాలు కోరగా ఎస్పీ గౌతమి సాలి వద్ద ఆయన పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. లక్ష్మీనారాయణ తీరుపై గౌతమ్‌ సాలి ఫిర్యాదు చేయడంతో అనంతపురం రేంజ్‌ డీఐజీ చర్యలు తీసుకున్నారు.