– ఎమ్మెల్యే ప్రత్తిపాటి
విజయవాడ, మహానాడు: నగరంలో ముంపుబారిన పడిన ప్రాంతాల్లో ఎక్కడా చుక్కనీరు కూడా నిలవకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆ మేరకే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే 45వ డివిజన్ పరిధిలో సహాయక చర్యలు, పారిశుద్ధ్య పనులను మంగళవారం పర్యవేక్షించారు.
సాధారణ ప్రజల నుంచి వ్యాపారవేత్తల వరకు సర్వం కోల్పోయిన వారిని ఎలా ఆదుకోవాలని ప్రభుత్వం నిశితంగా అధ్యయనం చేస్తోందన్నారు. 45వ డివిజన్‌లో సహాయ కార్యక్రమాల సమన్వయకర్తగా నియమితులైన మంత్రి అచ్చెన్నాయుడు, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుతో కలిసి సితార కూడలి, కబేళా సెంటర్, చనుమోలు వెంకట్రావు పైవంతెన వద్ద ఔట్‌ఫాల్ డ్రెయిన్‌ను పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. బుడమేరు ప్రవాహం తగ్గిందని, వరద ముంపునకు గురైన పలు ప్రాంతాలు తేరుకుంటున్నాయన్నారు. ఇళ్ళల్లోని వరద, బురద, ఇసుక మేటలు, వ్యర్థాలను త్వరితగతిన తొలగించేలా అగ్నిమాపక శాఖ, పారిశుద్ధ్య సిబ్బందికి సూచనలు ఇచ్చామని తెలిపారు. బ్లీచింగ్, సున్నం చల్లించడంతో పాటు దోమల నివారణకు రసాయన మందులు పిచికారీ చేయిస్తున్నామన్నారు.