– ‘కొల్లి‘పై చర్యలతో ఖాకీలలో కలవరం
– నేరుగా ఎన్నికలతో సంబంధం లేని ఐపిఎస్ కొల్లి హోదా
– డీజీపీ, సీఎస్, కలెక్టర్లు, ఎస్పీ, ఐజీ, డీఐజీలకే బదిలీలు
– కానీ ‘కొల్లి’ని ఎన్నికల బాధ్యత పేరుతో మరొక రాష్ట్రానికి బదిలీ
– ఈసీ ప్యానెల్ బ్రీఫింగ్ ట్రైనింగ్ లిస్టులో పేరు లేని కొల్లి
– ఆ జాబితాలో 37 మంది ఐఏఎస్, 27మంది ఐపిఎస్‌లు
– కూటమి ఫిర్యాదుతోనే కొల్లిని వ్యూహాత్మకంగా తప్పించిన ఈసీ
– అదే దారిలో సంజయ్, సునీల్ కుమార్, మరికొందరు?
– ఈసీ చర్యలతో కొందరు ఐపిఎస్‌లో కలవరం
– వైసీపీ అనుకూల డీఎస్పీ, ఎస్పీలకు వణుకు
– ఐఏఎస్‌లకూ స్థానచలనం తప్పదా?
– సీఎస్, ఇన్చార్జి డీజీపీ పీఠం కదులుతోందా?
– కొత్త సీఎస్‌గా నీరబ్ లేదా సిసోడియా?
– ఏబీవీ కేసును క్యాట్ కొట్టేస్తే ఆయనే కొత్త డీజీపీ?
– వచ్చే వారం తేలనున్న ఏబీ భవిష్యత్తు?
– లేదంటే ద్వారకాకే చాన్స్?
– సర్కారు అనుకూల అధికారులపై వేటు తప్పదా?
– ఐఏఎస్-ఐపిఎస్ వర్గాల్లో చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఎన్నికల సంఘం చర్యల కొరడా ఝళిపిస్తోందా? ఇప్పటివరకూ డేగకళ్లతో అన్నీ పరిశీలిస్తున్న ఈసీ… కేంద్ర పరిశీలకుల రాకతో ఆరోపణలు, ప్రభుభక్తిపరులైన ఐపిఎస్,ఐఏఎస్ అధికారులపై వేటుకు రంగం సిద్ధం చేసిందా? అందులో భాగంగానే ఐజీ కొల్లి రఘురామిరెడ్డిని ఎన్నికల పరిశీలకుడిగా పక్క రాష్ట్రానికి పంపిందా? ఎన్నికల ప్రక్రియతో ఏమాత్రం సంబంధం లేని కొల్లినే వ్యూహాత్మకంగా పక్కనబెట్టారంటే.. ఇక ఆరోపణలున్న ఐపిఎస్-ఐఏఎస్‌లను ఈసీ ఉపేక్షిస్తుందా?
కొల్లి దారిలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు, నలుగురు ఐజీ, ఏడీజీ స్థాయి అధికారులపై వేటు తప్పదా? సీఎస్ , ఇన్చార్జి డీజీపీ కూడా అందుకు మినహాయింపు కాకపోవచ్చా? కొత్త సీఎస్‌గా నీరబ్‌కుమార్, సిసోడియాలలో ఎవరికి పగ్గాలిస్తారు? క్యాట్‌లో కేసు కొట్టేస్తే ఏబీ వెంకటేశ్వరరావు పోలీసుబాసవుతారా? తాజా ఈసీ చర్యల కొరడాతో ఖాకీవనంలో కలవరం మొదలయిందా?.. ఇదీ ఇప్పుడు అధికార వర్గాల్లో హాట్ టాపిక్.
లేటయినా లేటెస్టుగా వచ్చానన్న సినిమా డైలాగు తరహాలో ఈసీ అడుగులు వేస్తున్నటుంది. ఇప్పటివరకూ ఎన్నికల ప్రక్రియతో నేరుగా సంబంధం ఉన్న వారిపై మాత్రమే వేటు వేసిన ఈసీ.. అసలు ఎన్నికలతో ఏమాత్రం సంబంధం లేని ఐజీ కొల్లి రఘురామిరెడ్డిని, పక్క రాష్ట్రానికి పరిశీలకుడి పేరుతో తప్పించడం పోలీసు వర్గాల్లో కలకలం రేగింది. నిజానికి ఎన్నికల సమయంలో ప్రతి రాష్ట్రం నుంచీ ఐఏఎస్,ఐపిఎస్ అధికారులను ఇతర రాష్ట్రాలకు జనరల్, పోలీసు పరిశీలకులుగా పంపిస్తుంటారు. దానికోసం ఈసీ ఒక జాబితా తయారుచేసి, కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తుంటుంది. వీరిలో ఎక్కువమంది కీలక బాధ్యతలు లేని వారినే సిఫార్సు చేస్తుంటారు.
ఆ ప్రకారంగా ఏపీ నుంచి 37 మంది ఐఏఎస్, 27 మంది ఐపిఎస్‌ల జాబితాను ఎన్నికల సంఘం పంపింది. ఆ జాబితాలో కొల్లి రఘురామిరెడ్డి లేరని ఐపిఎస్ వర్గాలు చెబుతున్నాయి. గత కొద్దిరోజుల నుంచి కూటమి నేతలు ఇన్చార్జి డీజీపీ, సీఎస్, ఇంటలిజన్స్ చీఫ్‌తోపాటు, కొల్లిని కూడా మార్చాలని ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా హెరిటేజ్ పత్రాల దగ్ధం వ్యవహారం కూడా కొల్లి మెడకు చుట్టుకుంది. ఆయన ఆదేశాలతోనే హెరిటేజ్‌లో చంద్రబాబుపై కుట్రకు సంబంధించిన పత్రాలు కాల్చేశారన్నది టీడీపీ నేతల ఆరోపణ.
ఈసీ సిఫార్సు జాబితాలో కనిపించని కొల్లి పేరు
నిజానికి ఎన్నికల సంఘం కార్యదర్శి సౌమ్యజిత్‌ఘోష్ మార్చి1 న ఇచ్చిన జనరల్, పోలీసు పరిశీలకుల జాబితాలో కొల్లి రఘురామిరెడ్డి పేరు లేదని ఆ జాబితా స్పష్టం చేస్తోంది. 27 మంది ఐపిఎస్ అధికారులలో మనీష్‌కుమార్ సిన్హా, సిహెచ్.శ్రీకాంత్, జి.విజయ్‌కుమార్, గోపినాధ్‌జెట్టి, విశాల్‌గున్ని, ఏఆర్ దామోదర్, వి.హర్షవర్దన్‌రాజు, డి.నరిశంహకిశోర్, ఆర్.గంగాధర్‌రావు, టి.పనసారెడ్డి, కెఎస్‌ఎస్‌వి సుబ్బారె డ్డి, రాజీవ్‌కుమార్ మీనా, త్రివిక్రమ్‌వర్మ, సర్వశ్రేష్ఠత్రిపాఠీ, డాక్టర్ షిముషి, డాక్టర్ కోయప్రవీణ్, సిహెచ్ విజయారావు, రాహుల్‌దేవ్ శర్మ, డాక్టర్ ఫకీరప్ప, అమిత్‌బర్దార్, గౌతమిషాలి, రాహుల్‌దేవ్ సింగ్ పేర్లు మాత్రమే ఉన్నాయి. కానీ విచిత్రంగా ఇందులో పేరు లేని కొల్లి రఘురామిరెడ్డిని ఇక్కడి నుంచి తప్పించారంటే.. ఈసీ చర్యల కొరడా ఏ స్థాయిలో ఉండబోతోందో ఊహించుకోవచ్చు. వివాదాస్పదంగా మారిన అధికారులు, ఆరోపణలు, ఫిర్యాదులు ఎదుర్కొంటున్న అధికారులపై వేటుకు, ఇదొక ప్రమాద ఘంటిక అన్న చర్చ అధికార వర్గాల్లో మొదలయింది.
ప్రధానంగా కొల్లిని ప్రత్యేక కారణాలతో పక్క రాష్ట్ర పోలీసు పరిశీలకుడిగా పంపించడంతో, జగన్ సర్కారుకు అనుకూలంగా పనిచేస్తున్న సీఐ నుంచి ఐపిఎస్ స్ధాయి అధికారుల్లో దడ మొదలయింది. కేవలం కూటమి ఫిర్యాదుతోనే స్పందించిన ఈసీ కొల్లిని లౌక్యంగా పక్క రాష్ట్రానికి పంపితే, ఇక తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన మొదలయింది. ఇప్పటికే కూటమి నేతలు పలువురు డీఎస్పీ, ఐపిఎస్ అధికారులను మార్చాలని ఫిర్యాదు చేశారు. దానితో తమ పీఠాలు ఎక్కడ, ఎప్పుడు కదులుతాయన్న ఆందోళన వారిలో మొదలయింది.
ప్రధానంగా వైసీపీతో అంటకాగుతున్న మరో నలుగురు ఐజీ, ఏడీజీ, డీఐజీలపై వేటు ఖాయమన్న ప్రచారం పోలీసు వర్గాల్లో జరుగుతోంది. ఇటీవల సర్కారుకు అనుకూలంగా ఐపిఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ పేరుతో రాసిన లేఖపై, సంతకం చేసిన వారిలో చాలామందిపై వేటు పడవచ్చంటున్నారు. సీనియర్ ఐపిఎస్ సునీల్, సంజయ్‌తోపాటు ట్యాపింగ్ చేస్తున్నారని ఫిర్యాదులున్న ఇద్దరు అడిషనల్ ఎస్పీలను కూడా మార్చవచ్చంటున్నారు. వీరిని కూడా ఇతర రాష్ట్రాలకు పోలీసు పరిశీలకులుగా పంపించే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
ముఖ్యంగా ఇన్చార్జి డీజీపీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాధ్‌రెడ్డిపై వేటు ఖాయమన్న చర్చ ఐపిఎస్ వర్గాల్లో జరుగుతుంది. ఇన్చార్జి డీజీపీ హయాంలో దేశంలో ఎన్నికలు జరిగిన దాఖలాలు ఎక్కడా లేవు. సుదీర్ఘకాలం పూర్తిస్థాయి డీజీపీ లేకుండా ఇన్చార్జితో పాలన సాగిన తీరుపై విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. సీనియర్లను కాదని రాజేంద్రనాధ్ రెడ్డిని నియమించడం వల్ల, ఆయన కంటే సీనియర్లు కూడా సహజంగా ఆయనను గౌరవించే పరిస్థితి ఉండదు. తమ కంటే జూనియర్ డీజీపీ అయినప్పటికీ సీనియర్లు ఆయనను ఖాతరు చేయరు. ఈ నేపథ్యంలో రాజేంద్రనాధ్‌రెడ్డిని తొలగించడం ఖాయంగా కనిపిస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
కొత్త డీజీపీ ఏబీవీ లేదా ద్వారకా?
కాగా ఇన్చార్జి డీజీపీగా ఉన్న రాజేంద్రనాధ్‌రెడ్డిని తొలగించిన తర్వాత, పూర్తి స్థాయి డీజీపీ రేసులో 1989 బ్యాచ్‌కు చెందిన ఏబీ వెంకటేశ్వరరావు, ద్వారకా తిరుమలరావు కనిపిస్తున్నారు. ఏబీపై సస్పెన్షన్ కేసు ప్రస్తుతం క్యాట్‌లో విచారణ జరుగుతోంది. ఈనెల 16లోగా తుదితీర్పు వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఏబీపై మోపిన అభియోగాలు నిరూపించడంలో జగన్ సర్కారు విఫలమయింది. అసలు పెగాసెస్ కొనేందుకు తాము నిధులు విడుదల చేయలేదని ఆర్థికశాఖ గతంలోనే స్పష్టం చేసింది. మరి అసలు కొనుగోలు చేయని పరికరాల్లో, నిధుల దుర్వినియోగం ఎలా జరిగిందన్న ప్రశ్నకు.. జగన్ సర్కారు ఇప్పటికీ కోర్టుకు జవాబు చెప్పలేక, కేసును వాయిదాల మీద నడిపిస్తోంది.
పైగా సుప్రీంకోర్టు తీర్పు కూడా ఆయనకే అనుకూలంగా వచ్చింది. రెండోసారి సస్పెన్షన్‌కు సర్కారు సరైన కారణాలు చూపించలేకపోయింది. తాజాగా క్యాట్‌లో జరిగిన వాదనలో కూడా క్యాట్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పట్టాయి. ఒకవేళ ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేస్తే డీజీపీ రేసులో ఆయనే ముందుంటారు. కాని పక్షంలో ఆర్టీసీ చైర్మన్ ద్వారకా తిరుమలరావుకు డీజీపీ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే కొత్త సీఎస్ నియామకం తర్వాత కొత్త డీజీపీ ఎవరన్నది తేలిపోతుంది.
కొత్త సీఎస్ నీరబ్ లేదా సిసోడి యా?
ఇదిలాఉండగా, సీఎస్ జవహర్‌రెడ్డిపైనా వేటు పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వాలంటీర్ల వ్యవహారంలో ఆయన పక్షపాతం ప్రదర్శించి, జగన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నందున ఆయనను తప్పించాలని కూటమి ఈపాటికే ఫిర్యాదు చేసింది. ఒకవేళ జవహర్‌రెడ్డిని తప్పిస్తే.. సీనియర్ ఐఏఎస్ నీరబ్‌కుమార్ లేదా సిసోడియాకు సీఎస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నీరబ్‌కు జూన్‌తో పదవీకాలం ముగుస్తుంది. అది అడ్డంకి కాకపోతే ఆయనకే ఎక్కువ చాన్సులున్నాయని, లేకపోతే ముక్కుసూటి అధికారిగా పేరున్న సిసోడియాకు అవకాశాలున్నట్లు ఐఏఎస్ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో ఒక ఉద్యోగ సంఘ నేతకు గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇప్పించారన్న ఆగ్రహంతో, జగన్ సర్కారు ఆయనను గవర్నర్ కార్యదర్శి పదవి నుంచి తప్పించింది. అయితే నిజానికి అందులో ఆయన పాత్రేమీ లేదని, జగన్‌కు అనుకూలంగా రాజ్‌భవన్‌లో ఉండే ఒక పోలీసు అధికారి ఫిర్యాదును నమ్మిన జగన్ సర్కారు, సిసోడియాను అక్కడి నుంచి తప్పించిందని అధికార వర్గాల్లో అప్పట్లోనే చర్చ జరిగింది.
రజత్‌భార్గవ్, శ్రీలక్ష్మి, అజయ్‌జైన్, అనంతరామ్ పేర్లు పరిశీలనలో ఉండే అవకాశం ఉన్నప్పటికీ, వీరిలో కొంతమందిపై ఆరోపణలు, మరికొందరు జైలుకు వెళ్లిరావడం, ఇంకొందరు చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన వారు ఉండటం, మరో ముగ్గురు ఢిల్లీ నుంచి వచ్చేందుకు ఆసక్తి చూపించకపోవడంతో.. చివరకు నీరబ్‌కుమార్ ప్రసాద్ లేదా సిసోడియాలో ఒకరికి సీఎస్ అవకాశం లభించవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.