పిడుగురాళ్లలో రెండోసారి పర్యటించిన మంత్రి నారాయణ
100 శాతం డయేరియా నివారించాలి
పిడుగురాళ్ల, మహానాడు: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల లో డయేరియా కట్టడిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. డయేరియాపై సీఎం చంద్రబాబు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో చర్చించారు. డయేరియాను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.
పిడుగురాళ్ల లో డయేరియా ప్రబలిన లెనిన్ నగర్,మారుతి నగర్ లో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తో కలిసి పర్యటించారు. ఇప్పటికే గురువారం ఒకసారి పిడుగురాళ్లలో పర్యటించిన మంత్రి నారాయణ… రెండు రోజుల వ్యవధిలో మరోసారి క్షేత్రస్థాయి పర్యటన చేశారు.. ముందుగా మారుతి నగర్ లోని పీహెచ్ సి లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.ఆ తర్వాత లేనిన్ నగర్, మారుతినగర్లోని వీధుల్లో శానిటేషన్, డ్రెయిన్ లలో సిల్ట్ తొలగింపు పనులను పరిశీలించారు. మంత్రి నారాయణ స్వయంగా డ్రైన్ లో పూడిక తొలగించారు. ఆ తర్వాత ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించి తాజా పరిస్థితి ని అడిగి తెలుసుకున్నారు.
సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు మంత్రి..లెనిన్ నగర్,మారుతి నగర్ లో మొత్తం 10 బోర్లు ఉండగా వాటిలో 8 బోర్లలో నీటిలో నైట్రేట్ ఉన్నట్లు పరీక్షల్లో బయటపడిందని మంత్రి నారాయణ చెప్పారు. శనివారం కూడా ఈ రెండు ప్రాంతాల్లో కొత్తగా 7 డయేరియా కేసులు నమోదైనట్లు మంత్రి తెలిపారు.. మరో రెండు కేసులు కోనంకి గ్రామంలో వచ్చాయన్నారు.. అయితే అందరి ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు.. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో డ్రైన్లలో రెండు రోజుల్లోగా పూర్తిగా పూడిక తొలగించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారని అన్నారు. పిడుగురాళ్ల వ్యాప్తంగా ఉన్న 170 కిమి మేర డ్రైన్లలో పూడిక తొలగించేందుకు అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలోని అన్ని హ్యాండ్ బోర్లలో నీటిని పరీక్షించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా 100 శాతం డయేరియా నివారించేలా ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. ప్రజలంతా కాచి చల్లార్చిన నీరు తాగాలని సూచించారు.