ప్రజారోగ్యానికి భంగం కలిగిస్తే చర్యలు తప్పవు 

-నగరంలో అధ్వాన పారిశుద్ధ్యంపై కమిషనర్ ఆగ్రహం 
-ఆకస్మిక తనిఖీలో పలువురు అధికారులు సస్పెండ్ 

గుంటూరు, మహానాడు:  ప్రజారోగ్యానికి భంగం కలిగించేలా విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఏ స్థాయి అధికారులపై అయినా శాఖాపరమైన చర్యలు తప్పవని నగర కమిషనర్ కీర్తి చేకూరి అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. బృందావన్ గార్డెన్స్, లక్ష్మీపురం, బ్రాడిపేట, కోబాల్ట్ పేట, కొత్తపేట, అరండల్ పేట, పొత్తూరివారి తోట, గుంటూరు వారి తోట తదితర ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి ఆయా ప్రాంతాల్లో రోడ్ల వెంబడి చెత్త కుప్పలు ఉండడం, కార్మికులు ప్రధాన రోడ్ల స్వీపింగ్ ప్రారంభిచక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసి, సంబందిత అధికారుల పై చర్యలు తీసుకున్నారు.

పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండడం, పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడం, సమగ్ర పర్యవేక్షణ లేకపోవడంతో పలువురు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ సిఎంఓహెచ్ డాక్టర్ ఆషా ని సరెండర్ చేయగా, బృందావన్ గార్డెన్స్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్.వి.ఎస్.ప్రసాద్ ని సస్పెండ్ చేశారు. కొత్తపేట శానిటరీ ఇన్స్పెక్టర్ హిదయతుల్లా పై చార్జెస్ ఫ్రేం చేసి, అక్కడి నుంచి బదిలీ చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వార్డ్ సచివాలయం వారిగా ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలన్నారు. ఇంటింటి చెత్త సేకరణ జరగని ప్రాంతాల్లో ప్రజలు రోడ్ల మీద, కాల్వల్లో వ్యర్ధాలు వేస్తున్నారని, ఆయా సచివాలయ కార్యదర్శులు, ఇన్ స్పెక్టర్లు పారిశుధ్య నిర్వహణపై నిర్లక్ష్యంగా ఉంటున్నారన్నారు. ప్రజారోగ్యానికి భంగం కల్గించేలా విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఏ స్థాయి అధికారుల పైన అయిన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

నగరంలోని పలు సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు, ఇన్ స్పెక్టర్ నిర్దేశిత సమయం విధుల్లో ఉండటం లేదని, ప్రధానంగా మస్టర్ కి కూడా హాజరు కావడం లేదని తమ దృష్టికి వచ్చిందని, బుధవారం నుండి మస్టర్లను కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తామన్నారు. శానిటరీ సూపర్వైజర్లు పర్యవేక్షణ లోపం వలన పారిశుధ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, వారి పని తీరుని కూడా సమీక్ష చేస్తామన్నారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల కల్లా కార్మికులు, కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్ల హాజరు నివేదిక తమకు పంపాలని, ప్రతి ఒక్కరూ వైర్ లెస్ సెట్ తప్పనిసరిగా వినియోగించాలని ఎంహెచ్ఓని ఆదేశించారు.

వార్డ్ సచివాలయాల వారిగా ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలని, సచివాలయం పరిధిలో చెత్త సేకరణ సమయం ముందుగా ప్రజలకు తెలియచేయాలన్నారు. మస్టర్ అయిన వెంటనే ప్రదాన రహదార్ల స్వీపింగ్ ప్రారంభించాలని, శానిటేషన్ కార్యదర్శులు కార్మికుల పనిని దగ్గర ఉండి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. మధ్యాహ్నం ప్రాధాన్యత క్రమంలో గ్యాంగ్ వర్క్ జరగాలని, ప్రస్తుత వర్షాలకు డ్రైన్లలో వ్యర్ధాలు అడ్డుపడకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. పర్యటనలో ఎంహెచ్ఓ(ఎఫ్ఏసి) మధుసూదన్, శానిటరీ సూపర్వైజర్ సోమ శేఖర్, శానిటరీ ఇన్ స్పెక్టర్లు, కార్యదర్శులు  పాల్గొన్నారు.