Mahanaadu-Logo-PNG-Large

అడ్డం తిరుగుతున్న సారు ‘ఆరు’

– ‘సారు’ కు ‘ఆరు’ రివర్స్
– ‘ఆరే’సుకుంటున్న బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు
– కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి
– తాజాగా శ్రీధర్‌బాబుతో ఆరుగురు గ్రేటర్ ఎమ్మెల్యేలు
– ఇటీవల ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల జంప్
– అదే దారిలో మరికొందరు ఎమెమల్సీలు
– మండలి చైర్మన్ అవిశ్వాసం లోపే కారు కథ కంచికి?
– ఇక బీఆర్‌ఎస్‌ఎల్పీ విలీనమే తరువాయి?
– ‘కారు’లో కల్లోలం
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ జాతిపిత, బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఆరు అచ్చొచ్చిన అంకె. అందుకే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అందులో ఆరు కనిపిస్తుంటుంది. ఇదంతా అధికారంలో ఉన్నప్పటి కథ. మరిప్పుడు.. అదే ఆరు సారుకు అడ్డం తిరుగుతోంది. ఆరుగురు చొప్పున ప్రజాప్రతినిధులు ‘కారు’ దిగి ‘చేయి’ కలిపేస్తున్న వైచిత్రి.

చూస్తుంటే.. సారు పార్టీ శాసనసభాపక్షం గంపగుత్తగా కాంగ్రెస్‌లో విలీనమయ్యే గత్తర కనిపిస్తోంది. అంటే..శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ అవిశ్వాసం పెట్టేలోపే, ఆ పార్టీ ఖాళీ అయ్యే ప్రమాదఘంటిక ముందస్తుగా మోగుతోందన్నమాట.
అప్పట్లో అధికారంలో ఉన్న కేసీఆర్ ఏ నినాదమైతే ఇచ్చారో.. ఇప్పుడు సేమ్ టు సేమ్ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు దానిని అందుకుని, అమలుచేస్తున్నారు.

నియోజకవర్గ అభివృద్ధి.. నవ తెలంగాణ నిర్మాణం.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నక్కలపాలు చేయవద్దన్న నినాదాన్ని.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, తమ పార్టీ అధినేత కేసీఆర్‌కు వినిపించి మరీ కారు దిగేసి, కాంగ్రెస్‌తో చేతులు కలిపేస్తున్నారు. సారు ఫిరాయింపుల సిద్ధాంతాన్ని తూ.చా తప్పకుండా పాటిస్తున్నారు. కొన్ని వేల పుస్తకాలు చదివి కనిపెట్టిన తన ఫిరాయింపుల సిద్ధాంతాన్ని, తన ఎమ్మెల్యేలు చిత్తశుద్ధితో పాటిస్తున్నందుకు సిద్ధాంతకర్తగా ఒకందుకు కేసీఆర్ గర్వపడాలే తప్ప, రోదించడం ఎందుకు?

అప్పుడు టీడీపీ-కాంగ్రెస్-బీఎస్పీ-సీపీఐ నుంచి ఎమ్మెల్యేలు బీఆరెస్‌లో చేరినా.. ఇప్పుడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగి, కాంగ్రెస్‌లో చేరినా ఒకటే నినాదం. అది నియోజకవర్గ అభివృద్ధి. అప్పుడు-ఇప్పుడూ ఒకటే నినాదం! ముసుగు ఒకటే. కాకపోతే పార్టీలే వేరు. ఇది నవ తెలంగాణ రాజకీయాలకు కేసీఆర్ నేర్పిన ఫిరాయింపుల విద్యనే. దానికి ఇప్పుడు వగచి ప్రయోజనం లేదు. కానీ ఇప్పుడు ఆ ఫిరాయింపులపై కేసీఆర్ నుంచి కేటీఆర్ వరకూ రోదన-వేదనలు వినిపిస్తున్నారు.

అది అనైతికం,అప్రజాస్వామ్యమని భూమ్యాకాశాలు ఏకమయ్యేంతగా పెడబొబ్బలు పెడుతున్నారు. కేసీఆర్ అధికారంలో ఉండగా టీడీపీ-కాంగ్రెస్ శాసనసభాపక్షాలను అమాంతం మింగేసి, తన పార్టీలో కలిపేసుకున్న బీఆర్‌ఎస్.. ఇప్పుడు ప్రజాస్వామ్యం- ఫిరాయింపుల పర్వం గురించి మాట్లాడమే వింత. తాను చేస్తే సంసారం. ఎదుటివాడు చేస్తే వ్యభిచారమన్నది బీఆర్‌ఎస్ నయా రాజకీయ సిద్ధాంతం. తన బాధ ప్రపంచం బాధ ఎట్లవుతుంది?

ఇప్పుడు తెలంగాణలో ఫిరాయింపుల పండగ, సెక్రటేరియేట్ లైటింగ్ లెక్క దేదీప్యమానంగా వెలిగిపోతోంది. అందులో కూడా సెంటిమెంటు పండుతోంది మరి. కేసీఆర్‌కు కలిసొచ్చిన, ఆయన బాగా నమ్మే ‘ఆరు’ అంకె ఇప్పుడు సారుకే అడ్డంగా అడ్డం తిరుగుతోంది. ఆరుగురు ఎమ్మెల్సీలు కూడబలుక్కుని కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యేలదీ అదే దారి. తాజాగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి కారు దిగి, సీఎం రేవంత్‌తో కాంగ్రెస్ కండువా కప్పించుకున్నారు.

ఈ వరద అక్కడితో ఆగిపోలేదు. సీనియర్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో గ్రేటర్ హైదరాబాద్ బీఆరెస్ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, అరికపూడి గాంధీ, వివేక్, లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు భేటీ అయ్యారు. తామంతా నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసమే మంత్రిని కలిశామని ముచ్చట్లు చెబుతున్నా.. అసలు ముచ్చట కాంగ్రెస్‌లో చేరడమేనన్నది బహిరంగ రహస్యం. ఇక్కడ విచిత్రమేమిటంటే.. మంత్రి దుద్దిళ్లను కలిసిన వారిలో, సారు బాగా ఇష్టపడే ‘ఆరు’గురు ఎమ్మెల్యేలుండటం! ఇది దేవుడి స్క్రిప్టా? లేక రేవంత్ లెక్కనా?

తన పార్టీ నుంచి ఫిరాయించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టి, మండలిపై తన పట్టు కొనసాగించుకోవాలన్న కేసీఆర్ పట్టుదల నిలిచేలా కనిపించడం లేదు. అసలు ఆలోగానే బీఆర్‌ఎస్‌ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకుని, ‘కారు’ కథను కంచికి చేర్చాలన్నది రేవంత్ లక్ష్యంగా కనిపిస్తోంది. అధికారంలో ఉంటే ఏమేం చేయవచ్చో కేసీఆర్ ఆల్రెడీ చేసి చూపించారు కాబట్టి, రేవంత్ కొత్త స్కూల్లో చేరకుండా.. అదే సిలబస్ ఫాలో అవుతున్నారు. దీన్ని తప్పు పట్టి, దానిపై చర్చించడం..ప్రజాస్వామ్యానికి పాతర వంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం అవివేకం. అది ప్రజాస్వామ్య ప్రియుల ఆరోగ్యానికి మంచిది కాదు. కాకపోతే ఇవన్నీ టీవీల్లో చర్చలకు అక్కరకొస్తాయంతే.

అప్పుడు ఆ విలీనాన్ని కేసీఆర్ అండ్ కో ఎంత గొంతుచించుకుని, గావుకేకలు పెట్టినా తెలంగాణ సమాజం ఆలకించదు. జాలిచూపదు. పైగా ‘నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్ష’ అని, తెలంగాణ జాతిపితకు గుర్తు చేస్తుంది. ఎందుకంటే గతంలో టీడీపీ-కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని చీల్చి, తన పార్టీలో దర్జాగా విలీనం చేసుకున్న కేసీఆర్ .. ఇప్పుడు తన పార్టీ విలీనమవుతున్నా నిస్సహాయంగా.. నిర్లిప్తతగా.. నిస్తేజంగా.. నిర్వేదనతో ప్రేక్షకుడిగా వీక్షించడం వినా, చేసేదేమీలేదు. గతంలో కేసీఆర్ హయాంలో, ఫిరాయింపులపై స్పీకర్లు ‘ఎంత వేగంగా’ స్పందించారో.. ఇప్పుడూ ‘అంతే వేగం’తో స్పందిస్తున్నారు. స్పీకర్లు మారారు తప్ప, వారి పాత్రలు మాత్రం సేమ్ టు సేమ్!