కూటమి ప్రభుత్వంతో అదనపు సంక్షేమం

-వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు
-కారుమంచి, వయ్యకల్లులో ఎన్నికల ప్రచారం
-పాల్గొన్న లావు శ్రీకృష్ణదేవరాయలు, మక్కెన

వినుకొండ, మహానాడు: కూటమి ప్రభుత్వంతో ప్రజలకు ఇప్పుడున్న పథకాలకంటే కనీసం మూడు, నాలుగు రెట్లు అదనపు సంక్షేమం అందుతుందని వినుకొండ కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు పేర్కొన్నారు. 150 నుంచి 160 సీట్లతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. గురువా రం శావల్యాపురం మండలం వయ్యకల్లు, కారుమంచిలో ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటిం టికీ తిరిగి తెలుగుదేశం సూపర్‌ సిక్స్‌ పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఇక్కడ డొల్ల మాటలు చెప్పే బొల్లా, అమరావతిలో మాయమాటలు చెప్పే జగన్‌ రెడ్డి పేదలకు ఒక్క ఇళ్లయినా కట్టించి ఇచ్చారా అని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రూ.2600 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని ధైర్యంగా చెప్పుకుంటానని, అలా చెప్పుకునే ధైర్యం బొల్లాకు ఉందా అని ఎద్దేవా చేశారు.

పేదలకు చివరకు పండగ కానుకలు కూడా ఎగ్గొట్టిన ఈ పనికిమాలిన ముఖ్యమంత్రి, దిక్కుమాలిన ఎమ్మెల్యే ఉండి ఏం ప్రయోజనం అని ఎద్దేవా చేశారు. బొల్లా నియోజవర్గ ప్రజలకు ఇచ్చిన వంద హామీల్లో ఎన్ని నెరవేర్చారో చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. లావు శ్రీకృష్ణదేవరాయలు పల్నాడు ప్రాంత నీటి కష్టాలు తీరాలంటే గోదావరి జలాలను తీసుకొచ్చి నకరికల్లు వద్ద సాగర్‌ కుడి కాల్వలో కలిపితేనే సాధ్యమన్నారు. పట్టిసీమ ద్వారా ఇప్పటికే ప్రకాశం బ్యారేజీకి నీళ్లు వస్తున్నాయని, ప్రకాశం బ్యారేజీకి వస్తున్న నీటిని సాగర్‌ కుడి కాల్వకు తరలిస్తే ఈ ప్రాంతంలో 2 పంటలకు సాగునీరి ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. వినుకొండ నియోజకవర్గంలో ఉన్న ప్రతిచెరువు నింపవచ్చన్నారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలను ఏదో తానే ప్రారంభించినట్లు ఎమ్మెల్యే బొల్లా చెప్పుకుంటున్నారని.. ఇందిరాగాంధీ హయాం నుంచే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయనే విషయాన్ని ఆయన తెలుసుకోవాలని చురకలు అంటించారు.