క్లెయిమ్‌ల ప‌రిష్కారంలో వేగంతో పాటు స‌రైన న్యాయం అవ‌స‌రం

– మాన‌వ‌తా కోణంలోనూ బాధితుల‌కు స‌హాయ‌స‌హ‌కారాలు అందించాలి
– కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేయాల్సిందంతా చేస్తున్నాయి
– ఇన్సూరెన్స్‌, బ్యాంకులు సేవ‌లందించాలి
– సంస్థ‌లపై విశ్వ‌స‌నీయ‌త పెరిగేలా కృషిచేయాలి
– ఏడు రోజుల్లో క్లెయిమ్‌లు పరిష్కరించాలి
– ఏ ఒక్క‌రికీ అన్యాయం జ‌ర‌గ‌కూడ‌దు… చివ‌రి మైలు వ‌ర‌కూ న్యాయం అందాలి.
– స‌మీక్షా స‌మావేశంలో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు

విజయవాడ, మహానాడు: వరద బాధితులకు సంబంధించి క్లెయిమ్‌ల ప‌రిష్కారంలో వేగంతో పాటు స‌రైన న్యాయం అవ‌స‌రమని అదే సమయంలో మాన‌వ‌తా కోణంలోనూ బాధితుల‌కు స‌హాయ‌స‌హ‌కారాలు అందించాలని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కోరారు.

ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ‌ మందిరంలో ముఖ్య‌మంత్రి అధ్య‌క్ష‌త‌న శుక్ర‌వారం సమీక్షా స‌మావేశం జ‌రిగింది.

స‌మావేశంలో పాల్గొన్నా ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంక‌ర్లు, ఎల‌క్ట్రానిక్ వ‌స్తు కంపెనీల ప్ర‌తినిధులు, అర్బ‌న్ కంపెనీ ప్ర‌తినిధులనుద్ధేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమన్నారంటే.. గ‌తంలో ఎన్న‌డూలేని విధంగా విజ‌య‌వాడ‌కు వ‌ర‌ద ముంపు ఎదురైంది. సంక్షోభ స్థితిలో ఉన్నవారికి మాన‌వ‌తా కోణంలో స‌హాయ‌స‌హ‌కారాలు అందించాల్సిన అవ‌స‌ర‌ముంది. వినూత్న ఆలోచ‌న‌ల‌తో ప్ర‌జ‌ల‌కు హాయ‌స‌హ‌కారాలు అందించాం. 110కిపైగా ఫైర్ ఇంజిన్ల‌తో గృహాలు, ర‌హ‌దారుల‌ను శుభ్రం చేసే కార్య‌క్ర‌మాన్ని చేశాం.

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల ప్ర‌జ‌ల ఆస్తి న‌ష్టాల‌కు సంబంధించి బీమా క్లెయిమ్‌ల స‌త్వ‌ర ప‌రిష్కారానికి విజ‌య‌వాడ స‌బ్‌క‌లెక్ట‌ర్ కార్యాల‌య ప్రాంగ‌ణంలో ఏర్పాటుచేసిన ఫెసిలిటేష‌న్ కేంద్రం ద్వారా న్యాయ‌మైన సెటిల్‌మెంట్స్ జ‌రిగేలా చూడాలి. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేయాల్సిందంతా చేస్తున్నాయి. ఇదే విధంగా ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు నిబ‌ద్ధ‌త‌తో వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించాలి. వాహ‌నాలు, గృహాలు, వ్యాపార వాణిజ్య ఆస్తుల న‌ష్టాల‌కు సంబంధించి జ‌రిగిన న‌ష్టాల‌పై వ‌చ్చిన ప్ర‌తి క్లెయిమ్‌నూ స‌రైన విధంగా అసెస్ చేసి ఆ మేర‌కు పూర్తిస్థాయిలో సెటిల్‌మెంట్ చేయాలి. మొత్తంమీద ప‌దిరోజుల్లో ఈ ప్ర‌క్రియ పూర్తిచేసేందుకు కృషిచేయాలి.

ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పించేలా, సంస్థ విశ్వ‌సనీయ‌త పెరిగేలా బాధిత ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించాలి. మాన‌వ‌తా కోణంలోనూ సాయ‌ప‌డాల‌న్న దృక్ప‌థంతో ప‌నిచేయాలి. సంక్షోభంలో ఉన్న ప్ర‌జ‌ల‌ను క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కించేందుకు త‌మవంతు స‌హ‌కారం అందించాలి. ఫాస్ట్‌తో పాటు ఫెయిర్‌నెస్ ఉండాలి. న‌ష్ట గ‌ణ‌న మ‌దింపు స‌రైన విధంగా జ‌రిగేలా చూడాలి. బాధితులు పూర్తిస్థాయిలో సంతృప్తి వ్య‌క్తం చేసేలా సేవ‌లందించ‌డం ప్ర‌ధానం. సంతృప్తి స్థాయిని (level of satisfaction) తెలుసుకునేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు ఐవీఆర్ఎస్‌, ఫోన్ కాల్స్ ఇలా వివిధ మార్గాల ద్వారా డేటాను తెప్పించుకుంటా. ఏ ఒక్క‌రికీ అన్యాయం జ‌ర‌గ‌కూడ‌దు. చివ‌రి మైలు వ‌ర‌కూ న్యాయం అందాలి. స‌ర్వేను వేగ‌వంతం చేయాలి. అవ‌స‌ర‌మైతే ఫీల్డ్ స‌ర్వేయ‌ర్ల‌ను పెంచుకోండి. ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఫోర్స్‌డ్ సెటిల్‌మెంట్స్ జ‌ర‌క్కూడ‌దు. ఒక‌వేళ క్లెయిమ్‌ల ప‌రిష్కారంలో నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే ప్ర‌భుత్వం ప‌రంగా త‌గిన చ‌ర్య‌ల‌కు ముందుకెళ‌తాం.

బాధితులను బ్యాంకులూ ఆదరించాలి

ప్రో యాక్టివ్‌గా బ్యాంకులు వ‌రద ప్ర‌భావిత ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించాలని సీఎం కోరారు. రుణాల రీషెడ్యూలింగ్‌, రీస్ట్ర‌క్చ‌ర్ వెసులుబాట్ల‌ను క‌చ్చిత‌త్వంతో అమలుచేయాలి. కొల్లేట‌ర‌ల్ సెక్యూరిటీ వంటి నిబంధ‌న‌లు లేకుండా చూడాలి. వ‌డ్డీ విష‌యంలో అద‌న‌పు భారం అనేది లేకుండా చూడాలి. కొత్త‌గా నీడ్ బేస్డ్ లోన్స్ (అవ‌స‌రం ఆధారిత రుణాలు)ను బాధితుల‌కు అందించాలి. పాడైన ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల రిపేర్ల విష‌యంలో కంపెనీలు సామాజిక బాధ్యతతో వ్య‌వ‌హ‌రించాలి. 100 శాతం లేబ‌ర్ ఛార్జీల్లో, 50 శాతం వ‌ర‌కు స్పేర్ పార్ట్స్‌లో రాయితీ క‌ల్పిస్తూ సేవ‌లందించాలి. ఇప్పుడు మీరు స్పందించే తీరే కస్టమర్లలో విశ్వ‌స‌నీయ‌త‌ను పెంపొందిస్తుంది. మార్కెట్లో బ్రాండ్ నిలబడుతుంది.

అవ‌స‌రం మేర‌కు టెక్నీషియ‌న్ల‌ను పెంచుకోండి. హైద‌రాబాద్‌, చెన్నై నుంచి కూడా వ‌న‌రుల‌ను స‌మీక‌రించుకోండి. క‌ష్ట‌కాలంలో అన్ని మార్గాల‌ద్వారా బాధిత ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌వాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని గుర్తుంచుకోండి. అయిదు రోజుల్లోగా వ‌చ్చిన ఫిర్యాదుల‌న్నింటినీ ప‌రిష్కరించేలా కంపెనీల సేవా కేంద్రాలు కృషిచేయాలి.

ఈ స‌మావేశంలో ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశవ్‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్‌, ముఖ్య కార్య‌ద‌ర్శి (ప్లానింగ్‌) పీయూష్ కుమార్, క‌లెక్ట‌ర్ డాక్టర్‌ జి.సృజ‌న త‌దిత‌రులు పాల్గొన్నారు. స‌మావేశంలో వ‌ర‌ద న‌ష్టాల క్లెయిమ్‌ల ప‌రిష్కారం, రుణాల రీషెడ్యూలింగ్‌, రీ స్ట్ర‌క్చ‌ర్‌, మార‌టోరియం, అవ‌స‌రం ఆధారిత కొత్త రుణాల మంజూరు, ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల రిపేరింగ్ త‌దిత‌రాల‌పై చ‌ర్చించారు.