ఆధ్యాత్మిక శోభతో వైభవంగా పంచ రాత్రి ఉత్సవాలు

విశాఖపట్నం, మహానాడు: నగరంలోని పలు ప్రాంతాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తకోటికి కన్నుల పండుగగా కొనసాగిన తీరు లోకవిదితం. జివీఎంసీ 95 వార్డు పరిధిలోని పురుషోత్తపురం వాసులు కంఫర్ట్ హోమ్స్ ఆధ్యాత్మిక వేదికపై దైవీ భావనలు వెదజల్లుతూ  శ్రీ విజయ గణపతి ఆలయ కమిటీ నిర్వహించిన పంచమ రాత్రుల పూజ వేడుకలు ఆదివారం వైభవంగా ముగిశాయి. సకల శుభప్రదాతగా దర్శనం ఇచ్చిన కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి జీవీ కాలనీ, హెచ్ బీ కాలనీ పరిసర ప్రాంత భక్తులు అసంఖ్యాకంగా తరలి వచ్చారు.

వి.నారాయణ, సత్యవతి దంపతులు సహకారంతో ప్రతిష్టించిన దుర్గామాత విగ్రహానికి వేద పండితులు భాస్కర రావు శర్మ, ఆలయ అర్చకులు రామారావు శర్మ పూజాక్రతువు నిర్వహించారు. పుణ్యాహవచనం, సహస్ర నామావళి, సామూహిక కుంకుమ పూజ, లలితా పారాయణ, మూలా నక్షత్రం నాడు పిల్లలచే సరస్వతి పూజ, లోక హితవును కాంక్షించే చండీ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

దిగ్విజయంగా పూజలు పూర్ణాహుతితో సమాప్తం అయిన తర్వాత ఆదివారం అమ్మవారిని నిమజ్జనానికి అంబరాన్నంటే నామస్మరణతో నివాసితులు తరలించారు. కార్యక్రమ నిర్వహణలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రెడ్డి సింహాచలం మాస్టర్, కార్యదర్శి తాడిమేటి మాధవ్, కోశాధికారి ఆలమూరు కేశవరావు, ఇతర కార్యనిర్వాహకవర్గ సభ్యులు ఎ.సురేష్ డి.సునీత, భానుమతి, ఉమాదేవి, శ్రీదేవి, అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కార్యదర్శులు వి.రామకృష్ణ, ఎం.సత్యనారాయణ, తదితరులు సహకరించారు.