ఏపీ లోనే వ్యవసాయ ఖర్చు ఎక్కువ

ఒక్కో రైతు కుటుంబం పై సగటు అప్పు 2.45 లక్షలు
భారత్ లో 11 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోతే అందులో 915 మంది ఏపీ వారే
వై.సి.పి ప్రభుత్వం ఆపిన రైతు రుణమాఫీ రెండు విడతల బకాయిలను విడుదల చేయాలి
రైతుల సమస్యలు, వ్యవసాయ విధానంపై శ్వేతపత్రం విడుదల చేయాలి

( వి. ఎల్. ప్రసాద్)

కేంద్రం నుండి రాష్ట్రాల వరకూ సంక్షేమ పథకాలకు వెచ్చించే డబ్బు తమ సొంత జేబు నుండో, పార్టీ నుండో ఇస్తున్నట్లు అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఏదైనా కొత్త పథకం ప్రవేశ పెడితే, తమకే పేటెంట్ దక్కాలనే ఆతృతను ప్రదర్శిస్తున్నాయి. ఒకరు ప్రవేశపెట్టిన పథకాన్ని మార్పులు చేయడమో , తీసివేయడమో చేస్తున్నాయి కొన్ని పార్టీలు.

అలా గత టి.డి.పి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వందలాది సంక్షేమ పథకాలను అటకెక్కించిన వై.సి.పి ప్రభుత్వం, కేంద్రం నుంచి లభించే పధకాలను కూడా నిలుపుదల చేసింది. దీనిలో ప్రతీకారమే కనిపిస్తోంది తప్ప, ప్రజలకు మేలు ఏ కోశానా కనిపించ లేదు. రైతు ప్రభుత్వం అని దప్పాలు కొట్టుకున్న వై.సి.పి ప్రభుత్వం.. కేంద్రం ఇచ్చే నిధులను ఎలా మురగ బెట్టిందో చూస్తే, అది ప్రజా ప్రభుత్వమా ? ప్రజా కంటక ప్రభుత్వమో తెలుస్తుంది.

కాపిటల్ ఇన్వెస్టిమెంట్ స్కీమ్ కింద 2023-24 రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ లేదు. కారణం 2022-23 లో ఈ స్కీమ్ కింద 6,105 కోట్లు విడుదలయితే వాడిన వివరాలు అందించక పోవడంతో, ఆ జాబితా నుండి ఎ.పి ని తొలగించింది కేంద్ర ప్రభుత్వం. రైతులకు గిట్టు బాటు ధరలు లభించాలనే ఉద్దేశ్యంతో ఈ – నామ్ అనే జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానాన్ని 2016 లో తీసుకు వచ్చింది. ఈ పథకం అమలులో ఉన్న విషయాన్ని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేయక పోవడం వల్ల ఎ.పి రైతాంగం నష్టపోతోంది.

ఫసల్ బీమా యోజన పోర్టల్ అనే పథకం కూడా కేంద్రం అమలులోకి తీసుకువచ్చింది. దీనికింద ఖరీఫ్ పంటల బీమా కోసం రైతుల పంటల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేస్తుంది. 2023 సం.రం 60 లక్షల మంది రైతుల వివరాలు ఈ- క్రాప్ కింద 93 లక్షల ఎకరాల్లో వేసిన పంటల వివరాలు నమోదు చేశారు గానీ, కేంద్ర ప్రభుత్వ బీమా పోర్టల్ పథకంలో వీరిని నమోదు చేయలేదు. దాని వల్ల తుపాను వల్ల నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు ?
ఈ క్రాప్ లో నమోదును ఫసల్ భీమా పోర్టల్ లో వై.సి.పి ప్రభుత్వం ఎందుకు నమోదు చేయలేదు ? దీనికి ఎవరు బాధ్యులు ? 3.7 లక్షల ఎకరాల్లో కోతకు వచ్చిన వరి పైరు 31.5 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలు దెబ్బతిని 1 లక్షమంది రైతులు నిరాశ్రయు లయ్యారు.

ఎ.పి లో షుమారుగా ప్రతి సం. నవంబర్ – డిసెంబర్ నెలల్లో తుఫానులు వస్తున్నాయి. దీనిని తప్పించు కోవాలంటే పంట నాట్లను ముందుకు జరిపి, జూన్ లోనే నాట్లు పూర్తి అయ్యేటట్లు చేయ గలగాలి. దీనికి చంద్రబాబు పట్టిసీమ ద్వారా ముందుగా నీటిని విడుదల చేయించి, నాట్లను ముందుకు జరిపించగలిగాడు. రివర్స్ టెండరింగ్ ని అనుసరించిన వై.సి.పి ప్రభుత్వం , పట్టిసీమ ద్వారా నీటిని ఇస్తే చంద్రబాబుకు పేరు వస్తుందని.. దాన్ని సరైన సమయంలో వాడుకోక పోవడం వల్ల, ఒక్క పది రోజులు సమయం తేడాతో రైతులు పంట నష్టపోవల్సి వచ్చింది.

2019 అక్టోబర్ వరదల వల్ల , 2020 నవంబర్ తుఫాను వల్ల , 2021 లో వేరు వేరు చోట్ల 17 లక్షల ఎకరాల్లో , 2022 లో తక్కువగా 4 లక్షల ఎకరాల్లో , 2023 నవంబర్ లో తుఫాను తాకిడికి పంటలు గురయ్యాయి. 2023 సం. ఖరీఫ్ ప్రారంభంలో అతి వర్షాల వల్ల మునకతో, రైతు నాట్లు దెబ్బతినగా మరలా నాట్లు వేసుకుని కొంత మేర రైతునష్ట పోయాడు. ఆ తర్వాత వర్షాలు లేకుండా పోయాయి.

నవంబర్ లో మిగ్ జాం తుఫానును ఒక నెల ముందుగానే కేంద్ర హెచ్చరిక కచ్చితత్వంతో లెక్కించి చెప్పాయి. కానీ ప్రభుత్వం శ్రద్ధ చూపలేదు . సిఎసిపి అంటే ధరల కమిషన్ లెక్కల ప్రకారం.. భారత్ లో కెల్లా అన్ని రాష్ట్రాల తో పోల్చితే ఎ.పి లోనే వ్యవసాయ ఖర్చు అధికం అని చెప్పింది. ఎ.పి లో తొంబై శాతం పైగా రైతులు రుణాలు తీసుకునే వ్యవసాయం చేస్తారు. ఒక్కో రైతు కుటుంబం పై సగటు అప్పు 2.45 లక్షలు ఉంది.

గత టి.డి.పి ప్రభుత్వం సబ్సిడీ కింద 23 వేల ట్రాక్టర్లు రైతులకు అందిస్తే వై.సి.పి ప్రభుత్వం 6 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. ఇన్‌పుట్ సబ్సిడీ గా 3,750 కోట్లు అందించగా, ఈ ప్రభుత్వం 1950 కోట్లు మాత్రమే అందించింది . సూక్ష్మ సేద్యానికి నూరుశాతం సబ్సిడీ కింద గత ప్రభుత్వం 1250 కోట్లు 10 లక్షల ఎకరాలకు అందించగా , వై.సి.పి ప్రభుత్వం 2 లక్షల ఎకరాలకు మాత్రమే అందించి చేతులు దులుపుకుంది.

అలాగే ధరల స్థిరీకరణ నిధి గత ప్రభుత్వం 3,556 కోట్లతో ఏర్పాటు చేయగా వై.సి.పి ప్రభుత్వం ఆ నిధే లేకుండా చేసింది. అమ్మా పెట్టదు , అడుక్కోనివ్వదు అన్న విధంగా .. తమ ప్రభుత్వం పెట్ట లేక పోయినా , కేంద్రం అందించే సాయాన్ని కూడా మురగ బెట్టడం దివాళాకోరు తనాన్ని , సైకో మనస్తత్వాన్ని సూచిస్తోందని రైతు నాయకులు వాపోతున్నారు.

గత సం. భారత్ లో 11 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోతే, అందులో 915 మంది ఎ.పి వారే. ఇందులో రైతులు 300 మంది కాగా కౌలు రైతులు 600 మంది. ఈసారైనా కొత్తగా అధికారం లోకి వచ్చిన టి.డి.పి ప్రభుత్వం రైతుల వెతల పై శ్వేతపత్రం విడుదల చేసి, సబ్సిడీలు సకాలంలో అందే విధంగాను, ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలి.

పంటల బీమాను కచ్చితత్వంతో అమలు చేయాలి. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానించాలి. ఎరువులు – పురుగు మందుల ధరలను నియంత్రించాలి. ధాన్యం డబ్బును మూడు వారాల్లో విధిగా రైతుల ఖాతాలకు జమ చేయాలి. గతంలో వై.సి.పి ప్రభుత్వం ఆపిన రైతు రుణమాఫీ రెండు విడతల బకాయిలను విడుదల చేయాలని కోరుతున్నారు.