రానున్న రోజులన్నీ ప్రజలకు మంచి రోజులే..

– ఎమ్మెల్యే గద్దె రామమోహన్

విజయవాడ, మహానాడు: రానున్న రోజులు అన్నీ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలకు మంచి రోజులేనని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. విదేశాల నుంచి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వచ్చి పరిశ్రమలు స్థాపించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ కృష్ణలంకలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం శుక్రవారం ఉదయం జరిగింది. అనంతరం కృష్ణలంకకు చెందిన గజ్జవరపు ఏసుకు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ సొంత నిధులు రూ.25 వేలతో కొనుగోలు చేసిన చెవిటి మిషన్ను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ వారంలో ఒక రోజు నియోజకవర్గంలోని ఒక డివిజన్లో సమావేశం నిర్వహించి స్థానికంగా ఉన్న సమస్యలను తెల్సుకుని వారం రోజుల పాటుగా ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఆ సమస్యలను సంబంధిత శాఖ అధికారులు దృష్టికి తీసుకువెళ్ళి ఆ వారంలోనే పరిష్కారం అయ్యేలా కొత్త విధానాన్ని ప్రారంభించామని చెప్పారు. నియోజకవర్గంలోని సమస్య స్థాయిని బట్టి మున్సిపల్ కమీషనర్, మంత్రి అవసరమైతే ముఖ్యమంత్రి స్థాయికి ఆ సమస్య తీవ్రతను తీసుకువెళ్ళి పరిష్కరించేలా చూస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వేములపల్లి రంగారావు, గొరిపర్తి నామేశ్వరరావు, కేశనం భావన్నారాయణ, వేజర్ల రంగారావు, పుప్పాల సుబ్బారావు, పైడి ఈశ్వరరావు, తాడివాయి సత్యనారాయణ, కోడూరు పవన్ తదితరులు పాల్గొన్నారు.