-ఆసుపత్రులకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం
-వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారా?
-కూటమి విజయం తర్వాత అవినీతిపై విచారణ
-బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి
విజయవాడ, మహానాడు: జగన్ మాటలు కోటలు దాటుతాయి…చేతలు గడప దాటవని, ఆయన పర్యటనలో అన్నీ అబద్ధాలే చెబుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఎంతవరకు వాటిని అమలు చేశారో జగన్ చెప్పాలని ప్రశ్నించారు.
పేదలకు వైద్యం అందకుండా చేశారు…ఇప్పుడు అసలు రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారా అని ప్రశ్నించారు. కేంద్రం ప్రజల ఆరోగ్యం కోసం ఇచ్చిన నిధులు కూడా దారి మళ్లించారని ఆరోపించారు. యూనివర్శిటీ పేరు మార్చుకుని తన తండ్రి పేరు పెట్టడమే జగన్ చేసిన మార్పు అని, రూ.3500 కోట్లు అంచనా వేసి రూ.300 కోట్లు కూడా ఆస్పత్రుల అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని, చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారన్నారు. కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వ ని ఆయన ఆస్పత్రులకు నిధులు ఇవ్వమంటే పట్టించుకోలేదని దుయ్యబట్టారు.
రాష్ట్రాన్ని అవినీతి, అరాచక, అంధకార ప్రదేశ్‌గా మార్చిన ఘనత జగన్‌కే దక్కిందని, జగన్ పాలన చేతకాకే వందల మంది సలహాదారులను పెట్టుకున్నారని, వారి వల్ల ప్రజాధనం నిరుపయోగం తప్ప ఏం మేలు జరిగిందని ప్రశ్నించారు. పాదయాత్ర, బస్సు యాత్ర తరువాత జగన్‌కు తీర్ధయాత్ర తప్పదని, మే 13 తరువాత జగన్‌ను ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధం అంటున్నారని వ్యాఖ్యానించారు. మేము చెప్పిన అంశాలపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేంద్ర పథóకాలకు పేరు మార్చి ప్రచారం చేసుకుంటూ స్టిక్కర్ సీఎంగా మిగిలిపోయారని అన్నారు. కూటమి విజయం తర్వాత ప్రజల సొమ్మును దోచుకున్న వారిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. విలేకరుల సమావేశంలో మీడియా ప్యానెలిస్ట్ పాటిబండ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.