Mahanaadu-Logo-PNG-Large

తెలుగు వారందరూ బాగుండాలని కోరుకున్నా 

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ మంత్రులు 

విజయవాడ, మహానాడు:  ప్రపంచంలోని తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండే విధంగా అమ్మవారిని కోరినట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని భట్టి విక్రమార్క తోపాటు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సిడబ్ల్యుసి సభ్యులు రుద్రరాజులు సందర్శించారు. ఆలయ ఈవో, జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా యంత్రాంగం ఆలయంలో వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ఆలయ  అర్చకులు మల్లయ్య శాస్త్రి, వేద పండితులు అమ్మవారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో తెలంగాణ రాష్ట్రం విలసిల్లాలని ప్రత్యేక పూజలు, అర్చనలు చేయించారు.  వేద ఆశీర్వచనం అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ..

ఎన్నో ఆశలు ఆకాంక్షలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వ పాలనలో సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నాను. తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీపడి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సమగ్ర అభివృద్ధి చేయడానికి అమ్మవారు ఆశీర్వదించాలని వేడుకున్నాను. ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండే విధంగా అమ్మ  దీవించాలని కోరాను. తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో రైతులు అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో విలసిల్లాలని కనుకదుర్గమ్మను వేడుకున్నానని భట్టి తెలిపారు.