– సూపర్ సిక్స్ హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం
– ప్రజల్లోనే ఉండాలనేది మా సీఎం అభిమతం
– గుంటూరులో అన్న క్యాంటీన్ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ
గుంటూరు, మహానాడు: అన్న క్యాంటీన్లు కోసం పేదలంతా ఎదురుచూస్తున్నారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. మరికొద్ది గంటల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభానికి సిద్దమవుతుందటంతో బుధవారం గుంటూరులో అన్న క్యాంటీన్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి. చుట్టుగుంట లో ప్రారంభానికి సిద్ధంగా అన్న క్యాంటీన్ ను స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసరావు తో కలిసి మంత్రి పరిశీలించారు. క్యాంటీన్ భవనం నిర్మాణం, వడ్డించే ప్రాంతం, చేతులు కడుగుకునే ప్రాంతం, అక్కడ చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లు పరిశీలన తర్వాత మంత్రి నారాయణ మీడియా తో మాట్లాడారు.
గత టీడీపీ ప్రభుత్వంలో 183 అన్న క్యాంటీన్లు ప్రారంభించి కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన ఆహారం అందించాం. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అన్న క్యాంటీన్లు రద్దు చేసి ఆ భవనాలను ఇతర అవసరాలకు వినియోగించింది. అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు… ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు.. రేపు సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్ లు ప్రారంభించనున్నారు.. గతంలో మాదిరిగానే చక్కటి వాతావరణంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. మొదటి విడతలో 100 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం. రేపు సీఎం ప్రారంభించిన తర్వాత ఎల్లుండి మిగిలిన మరో 99 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం.
గుంటూరులో మొత్తం ఎనిమిది క్యాంటీన్లు ఉండగా వాటిలో ఏడు క్యాంటీన్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయయి. అన్న క్యాంటీన్లు ఏర్పాటుపై ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు… ఒక రోజుకు ఒక వ్యక్తికి ఆహారం అందించడానికి 90 రూపాయలు ఖర్చవుతుందని….15 రూపాయలు వినియోగదారుడు చెల్లిస్తే మిగిలిన 75 రూపాయలు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అన్న క్యాంటీన్లుకు విరాళం ఇచ్చేందుకు దాతలు ముందుకొస్తున్నారు. నిన్న ఒక దాత శ్రీనివాసరాజు కోటి రూపాయలు విరాళంగా ఇవ్వగా.. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారు కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ఈ నిధిని కార్పస్ ఫండ్ గా ఏర్పాటు చేసి దానిపై వచ్చే వడ్డీని క్యాంటీన్ అవసరాలకు వినియోగిస్తాం. కోటి రూపాయలు విరాళం ఇచ్చిన దాతల పేరుతో ఒకరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్ లకు ఆహారం సరఫరా చేస్తామన్నారు..విరాళం ఇవ్వాలనుకునే దాతలు పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయానికి పంపించాలని సూచించారు.
సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం
ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనినీ తప్పు పట్టడమే వైసీపీ పనిగా పెట్టుకుందని మంత్రి నారాయణ విమర్శించారు. అన్న క్యాంటీన్లు లో ఎక్కడా అవినీతి జరగలేదు. వైసీపీ వాళ్ళు రివర్స్ టెండరింగ్ పేరుతో అన్నీ నాశనం చేశారు. సూపర్ సిక్స్ పథకాలను, ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెంచిన పెన్షన్ల ను పంపిణీ చేస్తున్నది. పెన్షన్లు కోసం ఏడాదికి 33 వేల కోట్లు ఖర్చవుతుంది.
త్వరలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం. ఒకవైపు హామీలు అమలు చేస్తూ…మరోవైపు అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టాం… గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి లేకపోవడం తో ఎవరికీ ఉద్యోగాలు రాలేదు. వైసీపీ తీరుతో ఆ పార్టీ నాయకులే విసిగిపోయి మా పార్టీ వైపు వస్తున్నారు. దాంట్లో భాగంగానే పలు మున్సిపల్ కార్పొరేషన్ల ను కూటమి కైవసం చేసుకుంటుంది. గత సీఎం ఎప్పుడూ ప్రజల్లోకి రాలేదు. ఇంట్లోనే ఉండి పాలన సాగించారు. కానీ ప్రజల్లోనే ఉండాలనేది మా సీఎం విధానం.. అందుకే ఉండవల్లిలో తన నివాసం ఎదురుగానే అన్న క్యాంటీన్ ఉన్నప్పటికీ అక్కడ కాకుండా గుడివాడలో ప్రజల మధ్యలో అన్న క్యాంటీన్ ప్రారంభించాలని సీఎం నిర్ణయించారని మంత్రి నారాయణ అన్నారు.