కక్ష తీర్చుకోవడం కోసమే జగన్‌పై ఆరోపణలు

– టీటీడీ లడ్డూపై చంద్రబాబు ఆరోపణలు దుర్మార్గం
– ఎన్డీ డీబీ నివేదికపై రెండు నెలలు ఎందుకు ఆగారు?
– టీటీడీలో కాకుండా టీడీపీ ఆఫీస్‌లో ఎలా రిలీజ్‌ చేస్తారు?
– జగన్‌ ప్రశ్నలన్నింటికీ మీరు సమాధానం చెప్పాలి
– మా నాయకుడి సవాల్‌ను మీరు స్వీకరిస్తున్నారా?
– చంద్రబాబు, లోకేష్‌ ఫ్యామిలీ ప్రమాణానికి సిద్ధమా?
– మాజీ మంత్రి అంబటి రాంబాబు

గుంటూరు: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం తయారు చేసే నెయ్యిలో పశువుల కొవ్వు కలిపారంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. జగన్‌పై కక్ష తీర్చుకోవడానికే చంద్రబాబు ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు.

నాణ్యత పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపించిన నెయ్యి ట్యాంకర్లు వచ్చింది ఈ ప్రభుత్వ హయాంలోనే అని మాజీ మంత్రి గుర్తు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయానికి నెయ్యితో సహా వచ్చే అన్ని ఆహార పదార్థాలను పక్కాగా నాణ్యతా పరీక్షలు చేశాకే, అనుమతిస్తారని.. లేకపోతే నెయ్యి ట్యాంకర్లను కూడా తిప్పి పంపిస్తారని తెలిపారు. అలా వెనక్కి పంపిన ట్యాంకర్ల నెయ్యిని ప్రసాదం తయారీలో వినియోగించారని ఎలా ఆరోపిస్తున్నారని ప్రశ్నించారు. నెయ్యిలో కల్తీకి తావు లేకపోయినా, అదేపనిగా తమను నిందిస్తున్నారని అన్నారు.

శ్రీవారి ప్రసాదమైన లడ్డూ తయారీ కోసం సరఫరా చేసిన నెయ్యిలో పశువుల కొవ్వు, చేప నూనె వంటివి కలిపి ఉండొచ్చని గుజరాత్‌కు చెందిన ఎన్డీడీబీ (నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌) రెండు నెలల క్రితం రిపోర్ట్‌ ఇస్తే, ఇప్పుడు దాన్ని బయటపెట్టి రాద్దాంతం చేస్తున్నారని ఆక్షేపించారు. సమగ్ర విచారణ జరిపించి, నిజాలు నిగ్గు తేల్చాక మాట్లాడాల్సిన సీఎం స్థాయి వ్యక్తి, దురుద్దేశంతో పచ్చి అబద్ధాలు చెబుతూ, ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.

లడ్డూ తయారీలో నిజంగా కల్తీ నెయ్యి వాడారని సమగ్ర విచారణ తర్వాత తేలితే, బాధ్యులపై చర్య తీసుకోవచ్చన్న అంబటి, ఆ పని చేయకుండా అదేపనిగా గత తమ ప్రభుత్వాన్ని నిందించడం ఎంత వరకు సబబని నిలదీశారు. నిజానికి తమ నివేదికలో కచ్చితత్వం లోపించే అవకాశం ఉందని ఎన్డీడీబీ స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

ఏదేమైనా టీటీడీ లడ్డూపై చంద్రబాబు ఆరోపణలు దుర్మార్గమన్న అంబటి రాంబాబు, కోట్లాది భక్తుల మనోభావాలు ఆయన దెబ్బ తీశారని, అందుకు ఆయన ప్రతిఫలం అనుభవించక తప్పదని హెచ్చరించారు.

అయినా ఎన్డీడీబీ నివేదికను టీడీపీ ఆఫీస్‌లో ఎలా రిలీజ్‌ చేస్తారని నిలదీశారు. వాటన్నింటిపై జగన్‌ ప్రశ్నలకు టీడీపీ పెద్దలు సమాధానం చెప్పాలన్న ఆయన.. వైయస్సార్‌సీపీ నేత సవాల్‌ను.. చంద్రబాబు, లోకేష్‌ స్వీకరిస్తారా? కుటుంబంతో సహా ప్రమాణం చేస్తారా? అని సూటిగా ప్రశ్నించారు.