-రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు హర్షణీయం
-వచ్చే ఏడాది నుంచి యూనిట్ కి 4 లక్షలు
-తాగునీటి సమస్య లేకుండా చూస్తా..
-దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి, మహానాడు : రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు భద్రత ఉండాలంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన తోనే సాధ్యమని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ఆమె మంగళవారం ఓ ప్రకటనలో ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై స్పందించారు. ఈ సందర్బంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ…
తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన రాజముద్రతో కూడిన రైతు పట్టాదారు పుస్తకాలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలపై తన బొమ్మ వేసుకుని జగన్ మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. గత పాలకుల తప్పుల్ని కూటమి ప్రభుత్వం సరిదిద్దుతున్నామన్నారు. తాతతండ్రుల నుంచి వచ్చిన ఆస్తులపై ఎవరి బొమ్మ ఉండకూడదనేది ప్రజాభిప్రాయం.
రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా చంద్రబాబునాయుడు రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. నాటి అహంకార, పెత్తందారీ పోకడలు ప్రజాప్రభుత్వంలో ఉండవన్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడి వారి ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని గొట్టిపాటి లక్ష్మి వివరించారు.
పేదలకు మూడు సెంట్ల ఇళ్ల స్థలం
అర్హులైన నిరుపేదలందరికీ 2029 కల్లా శాశ్వత గృహ వసతిని కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు అమె వివరించారు. రానున్న వంద రోజుల్లో 1.25 లక్షల గృహాలు, ఏడాదిలో 8.25 లక్షల గృహ నిర్మాణాలు పూర్తిచేయాలనే లక్ష్యాన్ని నిర్థేశించడం శుభపరిణామమన్నారు. ఇకపై కొత్త లబ్దిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిదన్నారు. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లేఅవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించారన్నారు. గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్దిదారుల విషయంలో పక్షపాత పూరితంగా వ్యవహరించి పూర్తి అయిన ఇళ్లకు కూడా చెల్లింపులు చేయలేదన్నారు. ఇటువంటి బాధిత లబ్దిదారులకు వెంటనే చెల్లింపులు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారని గొట్టిపాటి లక్ష్మి తెలిపారు.
వచ్చే ఏడాది నుంచి యూనిట్ కి 4 లక్షలు
గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చి, మౌలిక సదుపాయాలు కల్పించలేదని, అటువంటి లేఅవుట్లలో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. 2014-19 మరియు 2019-24 మధ్య పోల్చితే గృహనిర్మాణ పథకంలో గత ప్రభుత్వ హయాంలో 9 నుంచి 10 వేల కోట్ల వరకు పేదలకు అన్యాయం జరిగిందని, పేదల ప్రభుత్వం అని చెప్పుకున్న వైసీపీ ప్రభుత్వం ఆర్థిక లాభాన్ని పేదవారికి అందకుండా చేసిందన్నారు. నా ఎస్సీ, ఎస్టీ, బీసీలని చెప్పుకునే గత ముఖ్యమంత్రి వారికి కూడా ఎలాంటి అదనపు లబ్ది లేకుండా చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో రూ.4.00 లక్షల యూనిట్ కాస్టుతో ఇళ్లను వచ్చే ఏడాది మార్చి నుంచి అమలవుతుందని ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారిని గుర్తించి లబ్ది చేకూర్చేందుకు త్వరలో సర్వే కూడా చేపట్టనున్నట్లు గొట్టిపాటి లక్ష్మి తెలిపారు.
తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తా..
ఆనాడు ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలుపుకున్నారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించారు. ఈ పథకాలను దర్శి ప్రాంత ప్రజానీకానికి దరి చేరేందుకు నా వంతు నిరంతరం పాటుపడతానని హామీ ఇచ్చారు. అదేవిధంగా శ్రీశైలం సాగర్ డ్యాములు నీటితో కళకళలాడుతున్నాయి. దర్శి ప్రాంతంలో సాగర్ కాలువలకు నీరు అందించి రైతాంగాన్ని ఆదుకుంటామని ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ తెలిపారు. అదే విధంగా తాగునీటి కష్టాలు లేకుండా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, గ్రామాల్లో చెరువులు నింపేందుకు సంబంధిత అధికారులతో చర్చిస్తున్నట్లు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చెప్పారు.