ఐదేళ్లలో గోతులు పూడ్చలేని పనికిరాని ప్రభుత్వం
తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్
గుంటూరు జిల్లా తెనాలి, మహానాడు: రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమిని గెలిపించాలని తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చార. తెనాలి నియోజవర్గం కొల్లిపర మండలంలో దావులూరి పాలెం, హనుమాన్ పాలెం, బొమ్మవారిపాలెం, అన్నవరం గ్రామాలలో బుధవారం మనోహర్ పర్యటించారు. మూడు పార్టీల ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. గ్రామాల్లో ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారి సమస్యలు విని పలు సూచనలు చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవాలని దిశా నిర్దేశం చేశారు.
ఎన్నికల ప్రచారమే కాకుండా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవటానికి గ్రామాల్లో పర్యటించడం జరిగిందని, రాబోయే రోజుల్లో గ్రామాల్లోని అభివృద్ధి కోసం మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లటం జరుగుతుందని తెలిపారు. ఈ ఐదేళ్లలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయలేదని, కనీసం గుంటలు కూడా పూడ్చటం చేతకాలేదని దుయ్యబట్టారు. రైతుల పట్ల వివక్ష చూపి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. గుంటూరు కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.