Mahanaadu-Logo-PNG-Large

విద్యార్థుల వసతి కోసం భవనాన్ని కేటాయించరూ!

కేంద్ర మంత్రికి విన్నవించిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు  

నరసరావుపేట, మహానాడు:  హాస్టల్ సౌకర్యం కోసం ప్రభుత్వ భవనం లేకపోవడంతో వసతి గృహాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. పల్నాడు జిల్లా, మాచర్లలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల కళాశాలలో విద్యార్థులకు వసతి సదుపాయం కల్పించేందుకు, మాచర్ల పట్టణంలోనే ఖాళీగా ఉన్న భారత ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భవనాన్ని లీజు కింద ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని ఎంపీ కోరారు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ ను ఢిల్లీలో కలిసి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్బంగా  శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. మాచర్ల పట్టణంలోని వివిధ కళాశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నిరుపేద బాలికలు విద్యనభ్యసిస్తున్నారని, వారికి భవనాల కొరత తీవ్రంగా ఉందన్నారు. మాచర్ల పట్టణంలో భారత ప్రసార మంత్రిత్వ శాఖ వారి సిబ్బంది కోసం ఇరవై గదులతో భవనాన్ని నిర్మించింది, కానీ అవి ఉపయోగంలో లేవు,  అలాగే, భారత ప్రసార మంత్రిత్వ శాఖ ఈ భవనాన్ని లీజుకు ఇచ్చేందుకు సుముఖంగా ఉందని.. వెనుకబడిన తరగతులకు చెందిన బాలికలు ఎదుర్కొంటున్న అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఖాళీగా ఉన్న భవనం లీజుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.