దళితులకు రేవంత్ క్షమాపణలు చెప్పాలి
జయంతి రోజు ఒక్క మాల వేయలేదు
కేసీఆర్ విగ్రహం పెట్టించారనే వదిలేశారా?
భట్టి విక్రమార్క నోరు తెరవరేం
బీఆర్‌ఎస్ నేతలు బాల్క సుమన్, గెల్లు శ్రీనివాసయాదవ్
హైదరాబాద్, మహానాడు: అంబేద్కర్‌ను అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని బీఆర్‌ఎస్ నేతలు బాల్క సుమన్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. కాం గ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్‌ను అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయం దగ్గర ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద అలంకరణ చేయలేదని, కనీసం పూలమాల వేయకుండా వదిలేశారని దుయ్యబ ట్టారు. సీఎం రేవంత్ రెడ్డికి అహంకారం ఎందుకు? అని ప్రశ్నించారు. విగ్రహం కేసీఆర్ పెట్టారనే అక్కడ ఏర్పాట్లు చేయలేదా…రేవంత్ రెడ్డి సమా ధానం చెప్పాలని హితవుపలికారు. అలాంటప్పుడు కేసీఆర్ కట్టిన సచివాలయం లో ఆయన ఎట్లా కూర్చుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ గుర్తులను చేరిపివేస్తామని రేవంత్ అన్నారు. కాళేశ్వరం నీళ్లను రైతులకు అంద కుండా ప్రభుత్వం వ్యవ హరిస్తోంది. భేషరతుగా రేవంత్ రెడ్డి దళిత సమాజానికి క్షమాపణలు చెప్పాలని కోరారు. డిప్యూటీ సీఎం భట్టి ఎందుకు సైలెంట్‌గా ఉన్నా రో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. గతంలో అనేక విషయాలపై స్పందించిన లౌకిక వాదులు, మేధావులు నోరు విప్పాలని కోరారు.
కవిత అరెస్టుపై అసత్య ప్రచారాలు
కవిత అరెస్టు విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. బీజేపీ దుర్మార్గపు పాలన సాగిస్తోంది. మోడీతో జోడీ కట్టకపోతే ఈడీ, సీబీఐ వస్తాయి. ఉత్తర భారతంలో మోదీకి కొరకరాని కొయ్యగా మారిన అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. దక్షిణ భారత్‌లో కేసీఆర్ కుమార్తె కవితను అన్యాయంగా జైళ్లో పెట్టారు. లిక్కర్ కేసులో మాగుంట శ్రీనివాసులరెడ్డి ఏపీలో ఎన్డీఏ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, హిమంత బిశ్వశర్మ, యామిని, ఏపీలో సీఎం రమేష్, కొత్తపల్లి గీత, సుజనా చౌదరి, అమరీందర్ సింగ్, సువెందు అధికారి బీజేపీలో చేరగానే కేసులు మాఫీ చేశారు. బీజేపీ వాషింగ్ పౌడర్ నిర్మా గా మారిందని దుయ్యబట్టారు.
రేవంత్ బీజేపీలోకి వెళ్లటం ఖాయం
బీజేపీ మ్యానిఫెస్టోలో మొత్తం అబద్దాలు ఉన్నాయని, బీజేపీ అబద్ధాల ఫ్యాక్టరీగా మారిందని విమర్శించారు. కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్‌ను తట్టుకోలేకనే అరెస్టు లు చేశారు. లిక్కర్ కేసులో ఉన్న వాళ్లు బీజేపీకి చందాలు ఇచ్చారు. రేవంత్ బీజేపీతో లాలూచీ పడి తెలంగాణలో బలహీన అభ్యర్థులను పెట్టారు. బడే బాయ్, చోటా బాయ్ ఒక్కటయ్యారు. రేవంత్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ లో చేరటం ఖాయమన్నారు. బీజేపీని గెలిపించడానికి రేవంత్‌రెడ్డి బలహీన అభ్యర్థులను పోటీలోకి దించారని విమర్శించారు.