సంక్షోభం నుండి… అభివృద్ధి వైపు ఆంధ్రా..

– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

దర్శి, మహానాడు: దొనకొండ మండలం, మంగినపూడి గ్రామంలో శనివారం సాయంత్రం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్ళి వందరోజుల కూటమి పాలనలో జరిగిన మేలు గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, భవిష్యత్తును తీర్చిదిద్దగలిగిన అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్‌, యువ నేత విద్యాశాఖ మంత్రి, యువతకు స్ఫూర్తి ప్రదాత నారా లోకేష్ వంద రోజుల్లో పాలనలో 100 అద్భుతాలు చేశారని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ప్రజా పాలన సాగుతోందన్నారు.

గత ఐదేళ్లలో వైసీపీ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి అప్పుల్లో నెట్టి వేసిన పరిస్థితుల్లో సంక్షోభాన్ని అధిగమిస్తూ ఇచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేశారన్నారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌.. పంచాయితీ వ్యవస్థకు జీవం పోసి, గ్రామ సభలు నిర్వహించి వన మహోత్సవాన్ని చేపట్టి అందరినోటా శభాష్‌ అనిపించుకున్నారని తెలిపారు. చెత్త పన్నులు తొలగిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని, ఇలా… అనేక చెత్త జీవోలను రద్దు చేసిన ప్రభుత్వం.. ‘మన మంచి ప్రభుత్వం’ అని పేర్కొన్నారు. పవిత్ర వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా అపవిత్రం చేసిన పాపాత్ములు వైసీపీ పాలకులని శాపనార్థాలు పెట్టారు. స్థానిక వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి తట్టుకోలేక కులాలు, మతాలు వర్గాల పేరుతో ఘర్షణలు సృష్టిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.