-గ్రామ స్థాయిలో మురుగునీటి నిర్వహణకు ప్రణాళికలు
-ఓడిఎఫ్, మొబైల్ అప్లికేషన్, సర్వేపై ఉన్నతస్థాయి సమీక్ష
అమరావతి, మహానాడు : స్వచ్చాంధ్ర హోదా సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలను క్షేత్ర స్దాయిలో అమలు చేసి తగిన ఫలితాలను రాబట్టాలని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారన్నారు. సచివాలయంలో బుధవారం ఓడిఎప్, మొబైల్ ఆప్లికేషన్, సర్వే తదితర అంశాలపై హైబ్రీడ్ విధానంలో ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు.
వివిధ జిల్లాల అధికారులు ఆన్ లైన్ విధానంలో పాల్గొన్నారు. కొన్ని గ్రామాల్లో ఇంకా బహిరంగ మలవిసర్జన చేస్తున్న సందర్భాలు కనిపించటం ఆందోళన కలిగిస్తుందని, దీనికి శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలని ఈ సందర్భంగా శశిభూషణ్ అధికారులను ఆదేశించారు. బహిరంగ మల విసర్జనను నివారణ ఆవశ్యకతపై ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించడం ద్వారానే ఈ సమస్యకు ముగింపు పలుకగలమన్నారు.
టాయిలెట్ టైపోలాజీ, టాయిలెట్ల అవసరం, రెట్రోఫికేషన్, గ్రే వాటర్ మేనేజ్‌మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, డెస్లడ్జింగ్ సేవలపై సర్వే నిర్వహించడం కోసం అభివృద్ధి చేసిన అప్లికేషన్‌ను సమర్ధ వంతంగా వినియోగించి వాస్తవ పరిస్ధితులను ప్రతిబింబింప చేయాలన్నారు. బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దక్కించుకున్న ఖ్యాతిని నిలబెట్టుకోవాలని విభిన్న పథకాల కింద దాదాపు 80 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించామని, ఫలితంగా 2018లోనే రాష్ట్రం వందశాతం బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా నిలిచిందన్నారు.
స్యఛ్చాంధ్ర కార్పొరేషన్ ఎండి గంధం చంద్రుడు మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి తడి పొడి చెత్త విభజన ఇప్పటికీ ప్రధాన సమస్యగా ఉందన్నారు. వ్యర్థాల నిర్వహణ యూనిట్లు విభిన్న కారణాలతో పనిచేయని విషయాన్ని గుర్తించామని, వాటిని తిరిగి గాడిలో పెట్టేందుకు కార్యాచరణ సిద్దం చేయవలసి ఉందన్నారు. ఈ పనిలో నిమగ్నమైన వివిధ వ్యవస్ధల మధ్య సమన్వయం సైతం కొరవడిందన్నారు. మరోవైపు రాష్ట్రంలో నిర్మించిన మరుగుదొడ్లలో ఎక్కువ భాగం ఒకే గుంటతో నిర్మించటం వల్ల అది వేగంగా నిండిపోయి సమస్యగా మారిందన్నారు. గ్రామ స్థాయిలో మురుగు నీటి నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేయడానికి ప్రాథమిక అధ్యయనం అవసరమన్నారు.
“స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్” హోదాను సాధించడానికి తగిన వ్యూహం, కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడానికి విభిన్న పారామితులపై సమగ్ర డేటాబేస్ అవసరమని ఈ విషయంలో క్షేత్ర స్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకులు విఆర్ కృష్ణతేజ మైలవరపు అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, జిల్లా పంచాయతీ అధికారులు, పంచాయతీ రాజ్, గ్రామీణ మురుగునీటి పారుదల ఇంజనీర్లు, పంచాయతీ సిబ్బంది సమన్వయంతో గ్రామ స్థాయి, గృహ స్థాయి సర్వే నిర్వహించాలన్నారు. గ్రామీణ మురుగునీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ కృష్ణా రెడ్డి, రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న హోదాల అధికారులు, సిబ్బంది ఈ సమీక్షలో పాల్గొన్నారు.