– కొండమోడు – పేరేచర్ల జాతీయ రహదారికి రూ. 881.61 కోట్లు
– ఎంపీ లావు కృష్ణ దేవరాయలు వెల్లడి
– కేంద్ర ప్రభుత్వానికి పల్నాడు ప్రజానీకం తరుపున ధన్యవాదాలు తెలిపిన ఎంపీ
న్యూఢిల్లీ: పల్నాడు జిల్లాలో కేంద్ర ప్రభుత్వం మరో మహా రోడ్డు నిర్మాణానికి రూ. 881.61 కోట్లు మంజూరు చేసిందని నరసరావుపేట ఎంపీ, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పార్లమెంట్ పక్ష నాయకుడు లావు శ్రీ కృష్ణ దేవరాయలు వెల్లడించారు. బుధవారం ఉదయం ఢిల్లీలో ఆయన మాట్లాడారు. పల్నాడు జిల్లాలోని కొండమోడు – పేరేచర్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రూ. 881 కోట్లు మంజూరు చేశారని ఎంపీ పేర్కొన్నారు.
ఈ రహదారిని కేంద్రం ప్రభుత్వంలోని భరత్ మాలా ప్రాజెక్టు నుండి ఎన్ హెచ్ (ఓ ) కిందకు మార్చి నిధులు మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఎన్నో ఏళ్ళుగా ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్య మంత్రిగా కొణిజేటి రోశయ్య హయం నుంచి రోడ్డు నిర్మాణం త్వరలోనే అనే ప్రచారం సాగింది, కానీ కార్యరూపం దాల్చలేదు, ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు ఈ రోడ్డు నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం తో పలుమార్లు చర్చించి పట్టుపట్టారు. శ్రీకృష్ణ దేవరాయలు కృషితోనే జాతీయ రహదారిగా గుర్తింపు పొందిన ఈ రహదారికి ఇప్పుడు మంత్రి నితిన్ గడ్కరీ నిధులు మంజూరు చేశారు. మొత్తం 49.917.కిమీ.దూరం ఉన్న ఈ నాలుగు లైన్ల జాతీయ రహాదారి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని శ్రీ కృష్ణ దేవరాయలు తెలిపారు. కాగా, ఈ జాతీయ రహదారికి అనుబంధంగా సత్తెనపల్లి, మేడికొండురుల వద్ద బైపాస్ రోడ్లు నిర్మించనున్నారు.