తిరుమలలో మరో కొత్త మోసం

తిరుమల: తిరుమలలో మరో కొత్త మోసం వెలుగు చూసింది. భక్తుల ఆధార్ కార్డులతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును మోసం చేస్తున్న ఇద్దరు దళారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భక్తుల ఆధార్ కార్డుల సాయంతో గదులు తీసుకుంటూ టీటీడీని మోసం చేస్తున్నట్లు గుర్తించారు.

ఈ రకంగా రెండు నెలల్లో 45 గదులు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తరుచుగా గదులు తీసుకుంటున్న వైనాన్ని గుర్తించిన టీటీడీ సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇద్దరు దళారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కృష్ణా జిల్లాకు చెందిన నాగ బ్రహ్మచారి, వరంగల్‌కు చెందిన వెంకటేశ్వరరావుగా గుర్తించారు.

ఇద్దరు నిందితుల మీద కేసు నమోదు చేసిన తిరుమల పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు ఇద్దరూ విలాసాలకు అలవాటు పడి తిరుమలకు వచ్చే భక్తులను మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆధార్ కార్డులు వేరే ఎవరైనా వీరికి ఇచ్చి సహకరిస్తున్నారా లేదా ఫేక్ ఆధార్ కార్డుల సాయంతో గదులు తీసుకుంటున్నారా అనేది తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.

ఆధార్ కార్డుల సాయంతో తిరుమలలో రూ50, రూ.100ల గదులు అద్దెకు తీసుకుంటున్న నిందితులు.. ఆ తర్వాత ఆ గదులను రూ.1000ల అద్దెకు ఇస్తున్నట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఇలా వచ్చిన సొమ్మను వ్యసనాలకు ఉపయోగిస్తున్నట్లు తిరుమల పోలీసులు తెలిపారు. ఈ దళారీ వ్యవస్థపై సమగ్ర దర్యాప్తు చేపడుతామని, టీటీడీ విజిలెన్స్ విభాగంతో కలిసి దీనిపై నిఘాపెట్టి దళారులను పట్టుకుంటామని తిరుమల పోలీసులు తెలిపారు.