పెట్టుబడులకు ఏపీ అత్యుత్తమం

సీఎంతో పలు కంపెనీ ప్రతినిధుల భేటీ

అమరావతి, మహానాడు:  పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ అత్యుత్తమ గమ్యస్థానమని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. సచివాలయంలో బిపీసీఎల్, విన్ ఫాస్ట్ సంస్థల ప్రతినిధులతో బుధవారం సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు. రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై బీపీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులతో చర్చించారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే దాదాపు రూ.60 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.

చంద్రబాబు తన డిల్లీ పర్యటన సందర్భంలో కేంద్ర పెద్దలతో బీపీసీఎల్ పెట్టుబడులపై చర్చించారు. వాటికి కొనసాగింపుగా నేడు బీపీసీఎల్ ప్రతినిథులతో భేటీ అయ్యారు. ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 4-5 వేల ఎకరాలు అవసరం ఉంటుందని కంపెనీ ప్రతినిథులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అససరమైన భూములు కేటాయిస్తామని… 90 రోజుల్లో ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన పూర్తి ప్రణాళికతో రావాలని కంపెనీ ప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు. అక్టోబర్ నాటికి ఫీజిబిలిటీ రిపోర్ట్ తో వస్తామని బిపీసీఎల్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు.

అనంతరం విన్ ఫాస్ట్ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. విన్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వియత్నాంలో పేరున్న సంస్థ. ఈ సంస్థ సీఈవో పామ్ సాన్ చౌ తో పాటు సంస్థ ప్రతినిథులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం ఆ సంస్థ ప్రతినిధులకు వివరించారు. ఈవీ, బ్యాటరీ తయారీ ప్లాంట్ ను ఏపీలో నెలకొల్పాలని చంద్రబాబు వారిని కోరారు. ప్లాంట్ కు అవసరమైన భూమి, ఇతర మౌళిక సదుపాయాల కల్పనకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున అన్ని విధాలా సహకరిస్తామని, పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా కోరారు. అంతకు ముందు బీపీసీఎల్, విన్ ఫాస్ట్ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి విందు ఇచ్చారు.