– రోడ్డు, కాలువపై ఎటువంటి పనులు చేయకూడదు
– నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
– కమిషన్ శ్రీనివాసులు హెచ్చరిక
గుంటూరు, మహానాడు: బహుళ అంతస్తు భవనాల నిర్మాణాల్లో భాగంగా రోడ్ల మీదకు ర్యాంప్ లు, డ్రైన్ల పై పెద్ద పలకలు వంటివి నిర్మించకూడదని, డ్రైనేజి లైన్ ని మేజర్ డ్రైన్ లోకి కనెక్ట్ చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసి) జారీ చేయబోమని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ కోదండరామయ్య నగర్, గోరంట్ల, పెద్ద పలకలూరు రోడ్డు, కాకాని రోడ్డు, ఆర్టీసీ కాలనీ తదితర ప్రాంతాల్లో ఆక్యుపెన్సి సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాలను పరిశీలించి, సెట్ బ్యాక్, రోడ్ల కొలతలు, ర్యాంప్ లు, డ్రైన్ల పై ఆక్రమణలను తనిఖీ చేసి, తదుపరి అనుమతులకు సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు మాత్రమే నగరంలో బహుళ అంతస్తు భవనాలను నిర్మించుకోవాలని నిబంధనలు ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు. భవనాలు నిర్మాణ దశలో వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు నిరంతరం పరిశీలిస్తూ, నిబంధనల మేరకు నిర్మాణాలు చేపట్టకుంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి, నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఆర్టీసీ కాలనీలో డ్రైన్ ని ఆక్రమించి ర్యాంప్ లు చేసిన నిర్మాణం గమనించి సంబంధిత ప్లానింగ్ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా సెట్ బ్యాక్ పోర్షన్ లో ఏ విధమైన నిర్మాణాలు చేయకూడదని, జనరేటర్లు కూడా పెట్టడానికి వీలు లేదన్నారు. పర్యటనలో సిటీ ప్లానర్ డి.రాంబాబు, టీపీఎస్ లు లక్ష్మణ స్వామి, సువర్ణ కుమార్, రసూల్, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.