• పుట్టపర్తిలో షో రూమ్ ప్రారంభం
• రాష్ట్రంలో మరో ఏడు ఏర్పాటు
• నేతన్నలకు గౌరవ ప్రదమైన జీవనం అందించడమే సీఎం లక్ష్యం
• త్వరలో కేంద్ర, రాష్ట్ర పథకాలపై అవగాహన
– రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత
పుట్టపర్తి, మహానాడు: చేనేత వస్త్రాల వినియోగంపై ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు ఆప్కో షోరూమ్ లు ఏర్పాటు చేయనున్నామని, ప్రైవేటు వ్యాపార సంస్థలకు దీటుగా షోరూమ్ లను రూపొందిస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. పుట్టపర్తిలోని ఆప్కో షోరూమ్ ను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2014-19 చంద్రబాబు ప్రభుత్వ పాలన చేనేతకు స్వర్ణయుగమన్నారు. ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి, చేనేత కార్మికులకు ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. తరవాత వచ్చిన జగన్…చేనేత పరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన పథకాలను నిలిపేశారన్నారు.
ప్రభుత్వం నుంచి చేయూత అందకపోవడంతో, గడిచిన అయిదేళ్లలో ఎందరో నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. మరోసారి సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు కావడంతో చేనేత రంగానికి మంచిరోజులు వచ్చాయన్నారు. నేతన్నలకు అన్ని విధాలుగా ఆదుకోవాలని లక్ష్యంతో సీఎం, మంత్రి నారా లోకేశ్ ఉన్నారన్నారు. 2014-19లో అమలు చేసిన పథకాలన్నింటినీ అమలు చేయాలని సీఎం నిర్ణయించారన్నారు. అదే సమయంలో కొత్త పథకాలను కూడా అమలు చేయడానికి ప్రణాళికలు సైతం సిద్ధం చేశారన్నారు. దీనిలో భాగంలో చేనేత వస్త్రాల తయారీకి సబ్సిడీలు అందజేస్తున్నారన్నారు. నూలు కొనుగోలుపై 15 శాతం సబ్సిడీ ఇస్తున్నామన్నారు.
ఈ ఏడాదిలో 10 షోరూమ్ లు
ప్రస్తుత ఏడాదిలో కొత్తగా 10 ఆప్కో షోరూమ్ లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని మంత్రి సవిత వెల్లడించారు. దీనిలో భాగంగా ఇప్పటికే రెండు షోరూమ్ లు ప్రారంభించామని, ప్రస్తుతం పుట్టపర్తిలో మూడో షోరూమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇవే కాకుండా త్వరలో మరో 7 షో రూమ్ లను ప్రారంభించబోతున్నట్టు మంత్రి వెల్లడించారు. నేతన్నలు తయారు చేసే వస్త్రాలను కేవలం ఆప్కోలోనే కాకుండా అమెజాన్, ఫ్లిప్ కార్ట్, జియో మార్ట్ వంటి ఈ కామర్స్ లోనూ విక్రయిస్తున్నామన్నారు. అన్ని ప్రాంతాలకూ చెందిన చేనేత వస్త్రాలు ఆప్కోలో లభిస్తాయన్నారు. రాష్ట్ర ప్రజలందరూ చేనేత వస్త్రాలను ధరించి, చేనేత కార్మికులకు అండగా ఉండాలని మంత్రి సవి కోరారు.
ట్రెండ్‌కు తగ్గట్టు ఆప్కో వస్త్రాలు
ఆప్కోలను ప్రైవేటు వ్యాపార సంస్థలకు దీటుగా నెలకొల్పుతున్నట్టు మంత్రి సవిత వెల్లడించారు. అదే సమయంలో ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్లు చేనేత వస్త్రాలను అందుబాటులో ఉంచుతున్నామని మంత్రి సవిత అన్నారు. ఇందుకోసం నేతన్నలకు నూతన డిజైన్లపై శిక్షణ కూడా ఇస్తున్నామన్నారు. మగ్గాలు వినియోగించే చేనేత కార్మికులకు 200 యూనిట్లు, మర మగ్గాలకు వినియోగించే వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేయాలని నిర్ణయించామన్నారు. చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కలిగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలపై అవగాహన కార్యక్రమాలు త్వరలో చేపట్టనున్నామని మంత్రి వెల్లడించారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ భారం ప్రభుత్వం భరించేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు. చేనేత పరిశ్రమకు అండగా ఉంటూ, నేతన్నలకు గౌరవప్రదమైన జీవనం అందించడమే తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, ఆప్కో ఎండీ పావనమూర్తి, ఆర్టీవో సువర్ణ, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.