– 4 రోజుల పాటు వేడుకలు
– తొలిరోజు విజేతలు వెల్లడి
– ముగింపు ఉత్సవానికి హాజరుకానున్న హోం మంత్రి అనిత
గుంటూరు, మహానాడు: ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఏపీఎస్‌పీఎఫ్) 33 ఆవిర్భావ దినోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆ సంస్థ అధినేత డీజీ డాక్టర్ త్రివిక్రమ వర్మ ఆధ్వర్యంలో ఐజి బి.వెంకటరామిరెడ్డి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆదివారం ఏపీఎస్‌పీఎఫ్ స్పోర్ట్స్ మీట్-2024ను ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకలు ఈ నెల 23వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు కొనసాగనున్నాయి. మొదటి మూడు రోజులు 202 మంది సిబ్బందికి క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, 100 మీటర్లు, 400 మీటర్లు, 5,000 మీటర్ల పరుగు పందాలు నిర్వహిస్తారు.
చివరి రోజున ముగింపు కార్యక్రమంలో విజేతలకు రాష్ట్ర హోం మంత్రి వంగలాపూడి అనిత, హోం ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కంచర్ల గంగాధర్ వార్ల చేతుల మీదగా బహుమతుల ప్రదాన కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఐజి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, క్రీడలు సిబ్బందిలో స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా, వారి శారీరక, మానసిక ధృడత్వాన్ని పెంపొందించడంలో ఎంతగానో సహాయపడతాయని అభిప్రాయపడ్డారు.
ఈ పోటీలు విజయాన్ని మాత్రమే కాకుండా, సమష్టిగా పనిచేయడం, క్రమశిక్షణ, క్రీడాస్పూర్తి వంటి విలువలను పెంచే ప్రయత్నం అని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధినేత డాక్టర్ త్రివిక్రమ వర్మ, సిబ్బందిలో శారీరక, మానసిక దృఢత్వం, క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో మరిన్ని క్రీడా కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ జోన్ కమాండెంట్ ఎం. శంకర్రావు, అసిస్టెంట్ కమాండెంట్లు కె.కృష్ణమూర్తి, బి.శ్రీనివాసరావు, పి.వి.ఎస్.ఎన్. మల్లికార్జునరావు, టి. కృష్ణమాచారి, కె. శ్రీనివాసులు, టి. కామేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. అలాగే, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు కూడా పాల్గొన్నారు.
తొలిరోజు విజేతల వివరాలు:
100 మీటర్ల పందెం: 1వ స్థానం: M.S. చక్రవర్తి (పిసి 3452)
2వ స్థానం: R. రంజిత్ కుమార్ (పిసి 5716)
3వ స్థానం: ఏ. మహేష్ (పిసి 5872)
400 మీటర్ల పందెం: 1వ స్థానం: పి. పెంటయ్య (పిసి 3978)
2వ స్థానం: M. నారాయణ రావు (పిసి 5698)
3వ స్థానం: ఏ. మహేష్ (పిసి 5872).