శతకోటి ఆశీర్వాదాలతో నామినేషన్ ఘట్టం
జనసంద్రంగా మారిన నరసరావుపేట
ర్యాలీలో పసుపు జెండాల రెపరెపలు
తరలివచ్చిన కూటమి శ్రేణులు
నరసరావుపేట, మహానాడు : నరసరావుపేట గడ్డపై తెలుగుదేశం జెండా ఎగరేస్తామని కూటమి నేతలు, కార్యకర్తలు కాలర్ ఎగరేసి మరీ చెప్పారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలు, కూటమి నేతలతో నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ కార్యాలయంలో ఉదయం వేద పండితుల ఆశీర్వచనాలు, ఇతర మత పెద్దల ప్రార్ధనలు అనంతరం మల్లమ్మ సెంటర్, శివుడి బొమ్మ సెంటర్ మీదుగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానంటూ అందరికీ మాటిచ్చి నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా మార్చి అభివృద్ధిలో దిక్సూచిగా చూపిస్తానని కార్యకర్తలకు మాటిచ్చారు. అనంతరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వైసీపీ కార్యకర్తలు అరవింద బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పదేళ్లుగా జగన్‌రెడ్డికి తోడుగా నిలిచినా…నియోజకవర్గం అభివృద్ధి అంతంత మాత్రమేనంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మనిషిగా పని చేసే చదలవాడ అరవింద బాబును గెలిపించుకుంటామని, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే మన బతుకులు మారుతాయని పేర్కొన్నారు.
చదలవాడ ఆదిత్య ఆధ్వర్యంలో ర్యాలీలు
టీడీపీ యువనేత చదలవాడ ఆదిత్య ఆధ్వర్యంలో గుర్రపు ర్యాలీ, మోటార్ బైకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యకర్తలకు, ప్రజలకు అభివాదం చేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి సరి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడతానని చదలవాడ అరవిందబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేములపల్లి వెంకటనరసయ్య, కపిలవాయి విజయ్‌కుమార్, డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు, నల్లపాటి రాము, మన్నవ మోహన్‌కృష్ణ, వేల్పుల సింహాద్రి యాదవ్, గోనుగుంట్ల కోటేశ్వరరావు, అట్లా చిన్న వెంకటరెడ్డి, షేక్ మీరావలి, కొట్ట కిరణ్, వల్లెపు నాగేశ్వరరావు, పులుకురి జగ్గయ్య, బండారుపల్లి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.