-భలే పోలీసు సంఘం బాసూ?!
-సీఐ తలపగులకొట్టినా ఖండించని పోలీసు అధికారుల సంఘం
-సీఐ రక్తమోడుతున్న దృశ్యాలు సంఘం నేతలకు కనిపించవా?
-బిందుమాధవ్ కు అన్యాయంపై ఐపిఎస్ అసోసియేషన్ స్పందించదా?
-ఏబీవీకి అన్యాయంపై పెదవి విప్పని ఐపిఎస్ సంఘం
-గతంలో ఎల్విఎస్ కు అవమానంపైనా మాట్లాడని ఐఏఎస్ సంఘం
-పాలకులకు ఇబ్బంది వస్తేనే స్పందిస్తారా?
– స్పందించని సంఘాలపై అధికారుల అసంతృప్తి
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్.. ఐపిఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్.. పోలీసు అధికారుల సంఘం. మొదటి రెండు సంఘాలు పెద్దతలలకు సంబంధించినవి. చివరిది పోలీసు శాఖలో పనిచేసే కింది స్థాయి అధికారులకు సంబంధించినది. హోదాలు-శాఖలు వేరయినా.. లక్ష్యం మాత్రం ఒక్కటే. తమ సహచరులకు సమస్యలు వచ్చినప్పుడు.. సంబంధింత అధికారితో మాట్లాడి, వాటిని పరిష్కరించటం! దీనికి ఇతర సంఘాలకు మాదిరిగా ఎన్నికలు కూడా జరుగుతుంటాయి. కానీ మూడు సంఘాలు అసలు పనిచేస్తున్నాయా? సమస్యల్లో ఉన్న తమ సహచరులకు దన్నుగా నిలుస్తున్నాయా? లేక పాలకులకు భయపడి గొంతు నులుముకుంటున్నాయా? పాలకులకు సమస్యలు వస్తే పై అధికారుల ఆదేశాల మేరకు గళం విప్పుతున్నాయా?.. ఇదీ ఐఏఎస్-ఐపిఎస్-పోలీసు శాఖలో జరుగుతున్న చర్చ.
నారాయణస్వామి అనే యువ పోలీసు అధికారి. వివాదరహితుడు. ముక్కుసూటిగా వెళ్లే మనస్తత్వం. కార్యక్షేత్రంలో దూసుకువెళ్లే వైఖరి. అలాంటి ఆఫీసర్పై మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో వైసీపీ మూకలు రాళ్లేసి తల పగులకొట్టారు. రక్తం వచ్చింని భయపడి ఆసుపత్రికి వెళ్లకుండా వారిని చెల్లాచెదురు చేశారు. అతను వైసీపీ వ్యతిరేకించే కమ్మ కులానికి చెందిన అధికారి కావడంతో, మాజీ మంత్రులు సైతం ఆయనను లక్ష్యంగా చేసుకుని, పేరు చివర లేని ‘చౌదరి’ని తగిలించి ఆరోపణల వర్షం కురిపించారు. సరే అది రాజకీయపార్టీల పని కాబట్టి, అంతకుమించి వారి నుంచి ఎక్కువ ఆశించలేం.
కానీ తన సహచర అధికారిపై వైసీపీ అల్లరిమూకలు దాడికి తెగబడి, రక్తం వచ్చేలా దాడి చేసి ఇన్నాళ్లయినా.. పోలీసు అధికారుల సంఘం కనీసం ఖండించకపోవడమే వింత. ఆ సంఘానికి చెందిన జిల్లా శాఖ కూడా ఆయనను పరామర్శించకపోవడం విడ్డూరం. మరి సంఘం ఉన్నది ఎందుకు? సహచరులకే దన్నుగా నిలడలేని సంఘాల వల్ల ఉపయోగం ఏమటి? అన్నది ఇప్పుడు పోలీసులు సంధిస్తున్న ప్రశ్న. పోనీ ఈ సంఘం మిగిలిన అంశాలపైనా ఇంత గౌరవంగా మూగనోము పడుతుందా అంటే.. లేదు!
డీజీపీ, ఏడీజీ, ఐజీ, డీఐజీలపై విపక్షాలు దాడి చేసే సందర్భంలో మాత్రం ఈ సంఘం నేతల గొంతు వినిపిస్తుంటుంది. రాజకీయాల కోసం పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీయవద్దనేది వీరి రెగ్యులర్ విన్నపం. క్షమాపణ చెప్పాలన్నది వారి నుంచి వినిపించే డిమాండ్.
అదెప్పుడంటే.. తమ పోలీసుబాసులపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టి, వారికి సమస్యలు సృష్టించినప్పుడు మాత్రమే. మరి నారాయణస్వామి లాంటి తమ సహచరులకు అలాంటి సమస్యలు వస్తే మాత్రం, స్పందించేందుకు భయపడటమే ఆశ్చర్యంగా ఉందన్నది పోలీసు అధికారుల ఆవేదన.
“ఈ ఎన్నికల హింసలో రాజకీయపార్టీల దాడుల్లో చాలామంది పోలీసులు గాయపడ్డారు. ఎస్ఐ, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులు చాలామంది గాయపడ్డారు. మా సంఘం వీటిని ఖండింలేదు. కారంపూడి సీఐ అయితే రాళ్లదాడిలో రక్తం కారుతున్న ఫొటోలు- వార్తలు మీడియాలో వచ్చినా సంఘం దానిని ఖండించలేదు. మా బాసులపై ఎవరైనా విమర్శిస్తే మాత్రం ప్రెస్మీట్లు, ప్రెస్అలీజులు చేస్తుంటారు. అంటే సాటి సంఘంలో ఉన్న మాలాంటి వారికంటే, వారికి మా బాసులే ఎక్కువా” అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తాడిపత్రిలో పోలీసులపై అధికారపార్టీ కార్యకర్తలు రాళ్లదాడి చేస్తే, స్వయంగా పెద్దాఫీసరే భయపడి ఇంట్లోకి వెళ్లి దాక్కున వైనంపై పోలీసు అధికార సంఘం స్పందిసే ఒట్టు.
ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో ఉండే పోలీసుబాసులకు సమస్యలు వచ్చినప్పుడే.. స్పందించడం సంఘానికి అలవాటయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తు న్నాయి. ఎంతోమంది అధికారులు పోస్టింగులు లేక వీఆర్లో మగ్గుతున్నారు. వారికి పోస్టింగులు ఇవ్వాలని, సెలవులు మంజూరు చేయాల్సిందేనని, జనాభాకు సరిపడా సిబ్బంది నియామకాలు చేసి పోలీసులపై భారం తగ్గించాలని డిమాండ్ చేసి, వాటి సాధనకు దృష్టి సారించాల్సిన సంఘం.. పైస్థాయి అధికారులకు ఇబ్బందులు వచ్చినప్పుడే స్పందించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఇక ఐపిఎస్ అధికారుల సంఘం పనితీరుపైనా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల సంఘం తరఫున విపక్షాలపై విమర్శలు చేసిన అధికారి.. పోలింగ్ అనంతర విధ్వంసంతో సంబంధం లేని, పల్నాడు ఎస్పీ బిందుమాధవ్పై సస్పెండ్ వేటు వేస్తే మాత్రం, కనీస స్పందన లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. తమ సహచర సంఘ సభ్యుడైన బిందుమాధవ్ను మాజీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా మీడియాలో తిట్టిపోస్తున్నా, కనీసం ఖండించకపోవడం మరో విడ్డూరం.
డీజీపీ, ఏడీజీలతోపాటు.. పలువురు ఐపిఎస్లకు వ్యతిరేకంగా విపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేసినప్పుడు, ఇదే ఐపిఎస్ సంఘం అధికారి సభ్యుడి హోదాలో మీడియాముఖంగా ఖండించారు. సంఘ నేతగా ఇంత చిత్తశుద్ధి ప్రదర్శించిన అదే అధికారి.. తన సంఘ సభ్యుడైన ఒక ఎస్పీని, అధికారపార్టీ ప్రజాప్రతినిధి ఒకరు మీడియాముఖంగా భార్యకులం పేరుపెట్టిమరీ విమర్శిస్తే మాత్రం, మౌనవ్రతం పాటించడమే వింత.
ఈ రెండు సంఘటనలు పరిశీలిస్తే.. ఈ సంఘాలు తమ పైస్థాయి అధికారులు ఇబ్బందుల్లో ఉంటే మాత్రమే స్పందిస్తాయని తేలిపోతుంది. ఇప్పుడు పోలీసు అధికారుల మనోభావన కూడా ఇదే. అసలు ఐపిఎస్ అధికారుల కొత్త కార్యవర్గం, ఎప్పుడు ఏర్పాటయిందని ఐపిఎస్ అధికారులే ప్రశ్నించడం ఆశ్చర్యం.
ఇక సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఐదేళ్ల నుంచి జగన్ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా, విచారణల పేరుతో వేధిస్తున్న విషయం బహిరంగమే. క్యాట్ ఆదేశాల మేరకు ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలంటూ, సోషల్మీడియా వేదికగా ప్రజా ఉద్యమమే మొదలయింది. అయినా ఆయనకు జరిగిన అన్యాయంపై ఐపిఎస్ సంఘం ఎప్పుడూ స్పందించలేదు.
గతంలో సీఎస్ గా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యం అనే నిజాయతీగల అధికారిని, మధ్యలోనే తొలగించి అవమానించిన వైనంపై సాధారణ ప్రజలు కూడా సర్కారు తీరును విమర్శించారు. అయినా ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్పందించలేదు. అసలు కలెక్టర్లు కాకుండనే రిటైరయిపోతున్న వారికి న్యాయం చేయాలని ఇప్పటివరకూ ఇదే ఐఏఎస్ సంఘం కోరకపోవడమే వింత.
సహజంగా ఎవరైనా ఐఏఎస్-ఐపిఎస్లకు అన్యాయం జరిగిందని భావిస్తే.. ఆయా సంఘాల అధ్యక్షులు సీఎస్-డీజీపీల వద్దకు వెళ్లి, వారి సమస్యను నివేదించేవారు. దానితో సదరు బాసులు స్పందించి, సీఎం వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరించే
సంప్రదాయం-హుందాతన వాతావరణం.. గత ఐదేళ్ల క్రితం వరకూ ఉండేది. ఐఏఎస్ సంఘానికి సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా ప్రాతినిధ్యం వహించిన ఎల్వీ సుబ్రమణ్యం.. ఎవరికైనా పోస్టింగులో తమకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేస్తే, వెంటనే ఆ సమస్యను సీఎస్తో చర్చించి పరిష్కరించిన ఉదంతాలు కోకొల్లలు. అప్పటి బాసులపై ముద్రలు ఉండేవి కాదు. సర్వస్వతంత్రులుగా పనిచేసేవారు. ఇప్పుడు అలాంటి వాతావరణం-హుందాతనం రెండూలేవన్నది అధికారుల ఉవాచ.