పథకాలు ఉచితమా? అనుచితమా?

పన్ను కట్టే వారి నుంచి పేదలకు పథకాలు ఖర్చు చేయడం సబబేనా?
విదేశాల్లో ఉచితాలు ఎలా ఉన్నాయి?
ప్రజలను సోమరిపోతులని చేస్తున్నారా?
ఆ డబ్బు పేదలదేనా?
ఎవరు నిజమైన లబ్ధి దారులు ?

( వి. ఎల్. ప్రసాద్ )

మీరు తరచుగా పేదలు ఉచిత పథకాలు అనుభవిస్తున్నారు . అందుకే దేశాలు ఇలా అయ్యాయి. రాష్ట్రాలు ఇలా తయారవుతున్నాయి అంటూ వాదిస్తూ ఉంటారు. మేము చెల్లించే పన్నుల సొమ్మంతా వారు తినేస్తున్నారు అని మధ్యతరగతి ప్రజలు.. ఉద్యోగులైతే మేము నిఖార్సు గా పన్నులు కట్టి దేశ సంపదను పెంచుతుంటే, ఉచితాలు పేదలకు పంచి మా నోట్లో మట్టి కొడుతున్నారని భావిస్తుంటారు.

కానీ ఇదంతా పచ్చి అబద్ధం. మీరే కాదు 90 % గా ఉన్న అల్పాదాయ, మధ్యతరగతి ప్రజలు ఎవ్వరూ అలా భావించ వద్దు. ఈ దేశం ఆ 90 % మందిదే. వారు ఎవరో కాదు. 50 % గా ఉన్న అల్పాదాయ వర్గాలు , 40 % గా ఉన్న మధ్యతరగతి జనులే. వారంతా. మీకు తెలియని , మనందరికీ తెలియని విషయం భారత్ కు పన్నుల రూపంలో లభించే 97 % ఆదాయం ఈ రెండు వర్గాలే చెల్లిస్తున్నాయి అంటే మీరు నమ్మగలుగుతారా ? ఇది ముమ్మాటికీ నిజం.

అది ఎలాగో చూద్దాం . అసలు ఎవరు ఈ దేశ సంపదను దోచుకునేదో కూడా తెలుసుకుందాం . కాబట్టి ఇప్పటి నుండి మీరు పేదలను చూసి ఈసడించుకోకండి. అసలు అన్ని దేశాలలో వ్యవస్థలు ఎలా నడిచాయో ముందు తెలుసుకోవాలి. రాచరికంలో రాజు చెప్పిందే ధర్మం. మంచో , చెడో వెంటనే తీర్పులు అమలయ్యేవి. తరువాత నియంతృత్వ ప్రభుత్వంలో అధ్యక్షుడు చెప్పిందే న్యాయం అయ్యింది.

అసలు విచారించకుండానే జనాలను మాయం చేయడం , అంతం చేయడం దీని లక్షణం. ధర్మ బద్దంగా శిక్షలు అమలు చేస్తే ఫలితాలు వేంటనే వస్తవి గానీ, నియంత నిదానంగా వ్యవస్థలను గుప్పెట బిగించి మొత్తం సమాజాన్ని నియంతృత్వంతో దోచు కుంటాడు. . ప్రశ్నిస్తే అంతం చేస్తాడు. చరిత్రలో అందరూ నియంతలూ ఇలాగే వ్యవహరించారు.

ఇక ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు.. ఎన్నికల ద్వారా.. ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వాలే, నీతివంతమైన పాలన అందిస్తాయని , సంక్షేమ పధకాలు అందరికీ అందిస్తాయని భావిస్తారు. కానీ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని గొప్పగా చెప్పుకునే భారత్ పేదరికం ఎక్కువుగా ఉన్న ప్రపంచ దేశాలలో ఒకటి. భారత్ లో 25 కోట్లకు పైగా జనాభా ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారని , దాదాపు 12 % ప్రజలు ఇంకా దారిద్యరేఖకు దిగువనే జీవిస్తున్నారని 2023 నీతి ఆయోగ లెక్కలే చూపిస్తున్నాయి.

కానీ ఇంకా ఎక్కువగానే ఉండవచ్చునని ప్రజాసంఘాలు చెబుతున్నాయి. 80 కోట్ల కుటుంబాల ప్రజలు గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచిత రేషన్ నేటికీ అనుభవిస్తున్నారు. ఇటీవల ముగిసిన 18 వ లోక్ సభ ఎన్నికల్లో 93 % సభ్యులు అంటే 543 లో 504 మంది కోటీశ్వరులేనట. బి.జె.పి 240 సభ్యుల్లో 227 మంది సభ్యులు, కాంగ్రెస్ నుండి 92 మంది కోటీశ్వరులట. బి.జె.పి కి మద్దతు ఇచ్చిన టి.డి.పి , జె.డి.యు ల్లో చాలా మంది కోటీశ్వరులే.

2009 లో లోక్ సభ సభ్యుల్లో 315 మంది కోటీశ్వరులుంటే.. 2024 కు అది 504 కు చేరింది. 46 % లోక్ సభ సభ్యులు నేర చరితులు ఎన్నిక కాగా , అందులో బి.జె.పి నుండి 94 మంది, కాంగ్రెస్ నుండి 49 మంది క్రిమినల్ కేసులున్న వారు ఎన్నికైనారు. ఇందులో 15 మంది మహిళలపై అత్యాచారాలు చేసిన వారున్నారు. 2009 లో 162 మంది ఎన్నికయితే 2024 లో నేరచరితుల సంఖ్య 251 కు చేరింది. బ్యాంకు ఎగవేత దారులైన పారిశ్రామిక వేత్తలు , క్రిమినల్ నేరస్తులు, కోటేశ్వరులు , వ్యాపారస్తులు 90 % పైగా వుంటే, వీరు చట్టాలు ఏ విధంగా రూపొందిస్తారు?

పేదల పట్ల వీరికి జాలి , దయ ఉంటాయా ? అసలు చట్ట సభల్లో పాల్గొనే తీరిక , ఓపిక ఉంటాయా ? తమ వ్యాపార వృద్ధి కోసం కార్పోరేట్ వ్యవస్థకు అనుకూలంగా చట్టాలు చేసుకోకుండా ఉంటారా ? అందుకే ప్రభుత్వాలు కార్పోరేట్ సంస్థలకు 14 లక్షల కోట్ల రుణాలను రద్దు చేశాయి. ఇంకా చేస్తూనే వుంటాయి. మరి ప్రజాస్వామ్యంలో మంచి జరుగుతోందా ? చెడు జరుగుతోందా ?

ఈ లోక్ సభ సభ్యుల కార్పోరేట్ అనుకూల నిర్ణయాలు వల్ల భారత్ లో సంపన్నులు , అతిపెద్ద సంపన్నులుగా మారుతున్నారని అంతర్జాతీయ సంస్థల లెక్కలు చెబుతున్నాయి. ఒక్క శాతం ధనవంతుల దగ్గర జాతీయ ఆదాయం దాదాపు 23 % వాటా వీరి వద్ద పోగుబడి వున్నదట. అదే వ్యక్తిగత సంపదకు వస్తే.. ఈ ఒక్క శాతం ధనవంతుల దగ్గర 40 % సంపద పోగుబడి వుంది. భారత జనాభాలో అల్పాదాయ వర్గాలు 50 % , మధ్యతరగతి వర్గాలు 40 % గా వుండగా , వీరి సంపద క్రమేపీ తగ్గిపోతూ , సంపన్నుల వద్దకు చేరిపోతోంది. ఇలాంటి విధానం ప్రపంచంలో ఏ దేశం లోనూ లేదని చెబుతున్నారు. 2017 జూలై 1 న జి.ఎస్.టి ( గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ) తీసుకువచ్చారు. 64 % జి.ఎస్.టి ఆదాయం 50 % అల్పాదాయ పేదల నుండే వస్తోందని, 33 % జి.ఎస్.టి 40 % గా ఉన్న మధ్య తరగతి ప్రజల నుండి లభిస్తోందని, కేవలం 3 % మాత్రమే 10 % గా ఉన్న సంపన్నుల వద్ద నుండి వస్తోందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

2012 – 23 మధ్య ఈ ఆర్ధిక అసమానతలు విపరీతంగా పెరిగి ఒక్క శాతం అతి సంపన్నుల దగ్గర 40 % పైగా సంపద పోగుబడి ఉంది. జి.ఎస్.టి వల్ల పన్ను ఒక్కసారే చెల్లించడం వల్ల వినియోగదారునికి లాభం అని ప్రభుత్వం చెబుతోంది. పాత పన్నుల విధానం ప్రకారం ఉత్పత్తి వ్యయం 100 రూ.లు అనుకుంటే , లాభం 10 % , 12 % ఎక్సైజ్ , హోల్ సేల్ డీలర్ వద్ద 12.5 % వాట్ వేయగా 138.6 అవుతుందని , అప్పుడు హోల్ సేల్ డీలర్ 10 % లాభం కలిపితే 152.46 అవుతుంది.

అదే జి.ఎస్.టి అమలు చేస్తే 100+ 10 + gst 12% = 123.2 అవుతుంది. హోల్ సేల్ లాభం 10 % కలిపితే 135.52 అవుతుంది. ఒక్కసారి టాక్స్ కట్టడం వల్ల ధర తగ్గుతుందని , ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ చెల్లింపు వల్ల వ్యాపారికి లాభం ఉంటుందని , సరుకు రాష్ట్రాలకు వచ్చేడప్పుడు చెక్ పోస్ట్ ల వద్ద ఏ ఇబ్బందీ ఉండదని , స్థానికంగా ఏ ఇతర పన్నులు వసూలు చేయరాదని , ఈ విధానం అమలు వల్ల పన్ను ఎగవేత దారులను పట్టిస్తుందని, ఆదాయ , పన్నుల శాఖ తెలియజేస్తోంది.

ఏ నెలకు ఆ నెల జి.ఎస్.టి పన్నులు చెల్లించడం వల్ల అవకతవకలకు వీలుపడదని, ఒకవేళ తప్పుడు ఇన్వాయిస్ చూపిస్తే వెంటనే దొరికి పోతారని, అలా తప్పుడు ఇన్ వాయిస్ వల్ల 2023 లో 13,175 కోట్ల ఆదాయం అదనంగా ప్రభుత్వానికి వచ్చిందని, 2024 లో అయితే ఈ మూడు నెలలకే 19,690 కోట్ల ఆదాయం వచ్చిందని ప్రభుత్వం చెబుతోంది. కొన్నింటికి ఎక్కువ పన్నులు విధిస్తారని, ఆన్ లైన్ గేమింగ్ లాంటి వాటిల్లో 20 % పైగా పన్ను విధిస్తారని , అధిక పన్ను వేసే ఇలాంటి చోట్ల పన్ను ఎగవేసే అవకాశం ఉందనీ చెబుతున్నారు.

ఆ లోపాలను కూడా సరిదిద్దు వలసిన అవసరం ఉంది. పన్నులు ఎగవేస్తున్నారు అంటే ఎవరో సహకరిస్తున్నారు అని అర్థం. ప్రభుత్వానికి , పోలీస్ శాఖకు తెలియకుండా ఏదీ జరగదు. ఒకవేళ జరిగినా వారు వెంటనే గుర్తించగలరు. కానీ రాజకీయ నాయకులే అక్రమాలకు తెర లేపుతున్నారని , వాటికి ఉద్యోగులు సహకరిస్తారని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.

భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినా ఉచిత రేషన్ , ఉచిత పథకాలు ఇంకా అందుతూనే ఉన్నాయి. ఇంత చేసినా సంక్షేమ పథకాలకు చేసే ఖర్చు జాతీయ స్థూల ఉత్పత్తిలో 1.5 % మాత్రమే. అందుకే 190 దేశాల మానవ అభివృద్ధి సూచీలో భారత్ 132 స్థానంలో ఉన్నదని , అన్నిరకాల అత్యంత అసమానతలు ఉన్న 157 దేశాలలో భారత్ 95 స్థానంలో ఉన్నదని , ప్రజల ఆనందంగా గడిపే సూచీలో 153 దేశాలలో భారత్ 144 స్థానంలో ఉందని , దేశమంతా జీవనదులు పారే భారత్ లో తాగే నీటికి కూడా ఇబ్బందులు పడుతున్నారని , ఇబ్బందులను ఎదుర్కొనే 122 దేశాలను తీసుకుంటే భారత్ 120 స్థానంలో ఉన్నదని గణాంకాలు చెబుతున్నాయి.

దేశంలో ఉన్న పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు , వ్యవసాయం , భవన – రోడ్ల శ్రామికులు , సన్న – చిన్నకారు రైతులు అంతా 63 % పన్నులు కడుతున్నారని , ప్రభుత్వ – ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు , భూస్వామ్య రైతులు 34 % పన్నులు కడుతున్నారని , ఎలా చూసుకున్నా అల్పాదాయ వర్గాలే పన్నులు అందరికంటే ఎక్కువ కడుతున్నారని కార్మిక , శ్రామిక నేతలు చెబుతున్నారు.

వారినే మనమంతా ఉచితాలకు ఎగబడుతున్నారు అని తిట్టు కుంటున్నాము. దోపిడీ చేస్తున్నది దోపిడీ చట్టాలను చట్టసభల్లో ప్రవేశ పెట్టి , వాటిని అమలు చేసే రాజకీయ నాయకులు , రుణాలు – పన్నులు ఎగవేత దారులయిన సంపన్నులు మాత్రమే. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా విద్య , వైద్యం ఉచితం గానే అందిస్తారు. వృద్ధులకు పెన్షన్ సౌకర్యం ఉంటుంది. కమ్యూనిస్ట్ దేశాల్లో అయితే నివాసాలు కూడా ఉచితంగా అందిస్తారు. కానీ ఎక్కడా పని చెయ్యకుండా ఉచితంగా ఇవ్వరు.

ఆడా – మగా ఎవరైనా శ్రమ చేయవలసిందే. అక్కడికీ ఇక్కడికి తేడా ఏమిటంటే.. ఏ ప్రభుత్వం వచ్చినా అది మనం చెల్లించే ప్రజల పన్నుల ధనం అని గ్రహించాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రభుత్వం – ప్రజలు బాధ్యతతో వ్యవహరిస్తారు. ఏ ప్రభుత్వం వచ్చినా సౌకర్యాలు అందరికీ నిబంధనల ప్రకారం అందించ వలసిందే. రాజకీయ ప్రమేయం అనేది ఉండదు.

కానీ భారత్ లో అందించే సేవలన్నీ తమ సొంత జేబుల్లో నుండి ఇస్తున్నట్లుగా , తమ బొమ్మలు వేసుకుని ఫోజులు కొడతారు మన రాజకీయ నాయకులు. పూర్తిగా ఏ పార్టీ అధికారం లోకి వస్తే, ఆ పార్టీ కనుసన్నల్లో పాలన నడుస్తుంది. పూర్తిగా పార్టీ స్వామ్యం తోనే దోపిడీ కొనసాగుతోంది. నిజమైన లబ్ధి దారులను ప్రజాస్వామ్యం పేరు చెప్పి హింసకు , పీడనకు గురిచేస్తున్నారు.