– సమీక్షా సమావేశంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం, మహానాడు: ఏరియా ఆస్పత్రే నా మానస పుత్రిక… దీన్ని చెడగొట్టేందుకు ప్రయత్నం చేస్తే సహించేది లేదని భావోద్వేగంతో మాట్లాడిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు. కలెక్టర్ విజయ్ కృష్ణణ్ ఆధ్వర్యంలో ఏరియా ఆస్పత్రిలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడారు. ఆస్పత్రిలో రోగులకు సేవ చేయడం వైద్యులకు దేవుడిచ్చిన వరమని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అలాగే, నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకురావడం తన లక్ష్యమని పేర్కొన్నారు.
తన హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల గురించి, లిప్ట్, మొబైల్ బ్లడ్ బ్యాంక్, ఆర్ధోపెడిక్ ఎక్స్-రే, డయాలసిస్ యూనిట్ తదితర విషయాలపై వివరించారు. అయిదేళ్ళకాలంలో ఆస్పత్రి నుంచి 6,000 మంది గర్భిణులను ప్రైవేట్ ఆస్పత్రులకు పంపారని అన్నారు. 2018లో నెలకు 500 డెలివరీలు జరిగేవి, ఇప్పుడు ఎంత జరుగుతున్నాయని ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ నీలవేణిని ప్రశ్నించారు. కొత్త ఎమ్మెల్యే ఇంకా ప్రమాణ స్వీకారం చేసి మూడు నెలలైనా కమిటీ వేయకపోవడంపై కూడా ప్రశ్నించారు. ప్రైవేటు ఆస్పత్రులకు రోగులను పంపించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మొబైల్ బ్లడ్ బ్యాంక్ ద్వారా గత అయిదేళ్ళకాలంలో ఎన్ని యూనిట్ల రక్తం సేకరించారో తెలియజేయాలని కోరారు. ఆస్పత్రి సిబ్బంది డబ్బులు వసూలు ఆరోపణలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
స్వల్పసేవల నిర్వహణలో లోపాలపై శ్రద్ధ వహించాలని, ప్రైవేటు ఆంబులెన్స్ లకు ప్రత్యేక ధర నిర్ణయించాలని సూచించారు. ఆయుష్ హాస్పిటల్ పూర్తయి అయిదేళ్ళు అవుతున్న నిరుపయోగంగా ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. హాస్పటల్ లో శస్త్ర చికిత్స కు కావలసిన పరికరాలు, మరొక ఆరో వాటర్ ప్లాంట్ హాస్పటల్ కు సమకూర్చుతానని స్పీకర్ తెలిపారు.
కలెక్టర్ విజయ్ కృష్ణణ్ మాట్లాడుతూ, ఆస్పత్రికి కొత్త అంబులెన్స్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇంకా, స్నేక్ బైట్ కేసును ఎందుకు ప్రైవేటు ఆస్పత్రికి పంపారో విచారించి తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో డీసీహెచ్ ఎస్.శంకర్ ప్రసాద్, ఆర్డీవో జయరాం, జనసేన ఇన్‌చార్జీ సూర్యచంద్ర పాల్గొన్నారు.