ఆర్మీ జవాన్ నాగరాజు కుటుంబ పరిస్థితిని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తా

– కుటుంబ సభ్యులను పరామర్శించిన టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వేదవ్యాస్

పెడన: ఇటీవల యుద్ధ ట్యాంక్ ప్రమాదంలో దుర్మరణం పాలైన ఆర్మీ జవాన్ సాదరబోయిన నాగరాజు కుటుంబాన్ని ఆదుకునేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని మాజీ శాసనసభ్యులు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. వాస్తవాదీన రేఖ సమీపంలో టి72 యుద్ధ ట్యాంక్ లో వెళుతున్నప్పుడు మంచు కరిగి నదికి వరదలు వచ్చినపుడు జరిగిన ప్రమాదంలో నాగరాజు మృతి చెందిన సంగతి తెలిసిందే.

సోమవారం ఆయన పెడన మండలం చేవేండ్ర గ్రామంలోని ఆర్మీ జవాన్ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను తల్లిదండ్రులు ధనలక్ష్మి వెంకన్న సోదరుడు శివయ్య భార్య మంగాదేవి లను పేరుపేరునా పలకరించి ఓదార్చారు. ఈ సంఘటన జరిగి నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ వారి కళ్ళనుంచి కన్నీరు రావడం చూసిన వేదవ్యాస్ చలించిపోయారు.

జవాన్ భార్య మంగాదేవి ఉరివి సచివాలయంలో పనిచేస్తుంది. సోదరుడు శివయ్య ఆర్మీ లో జవాన్ గా ఉన్నారు. ఇలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందవలసిన బెన్ఫిట్స్ విషయంలో తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో మాట్లాడి పరిష్కారం చేస్తానని జవాన్ కుటుంబ సభ్యులకు వ్యాస్ హామీ ఇచ్చారు.

ప్రభుత్వం నుంచి రావలసిన ఆర్థిక సహాయం విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదని కుటుంబ సభ్యులు వేదవ్యాస్ దృష్టికి తీసుకువచ్చిన మీదట ఆయన ఈ హామీ ఇచ్చారు. అలాగే నిబంధనల ప్రకారం భూమి ఇప్పించేందుకు కూడా తన వంతు కృషి చేస్తానన్నారు. అధైర్య పడకుండా బిడ్డ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ధైర్యంగా ముందుకు వెళ్లాలని మంగాదేవిని ఓదార్చారు. దేశ సేవలో మరణించిన నాగరాజు చిత్రపటానికి వేదవ్యాస్ నివాళులు అర్పించారు