తొలి ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి 

– కొండపై పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జీవీ 

వినుకొండ, మహానాడు:  వినుకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి తొలి ఏకాదశి తిరునాళ్ల బుధవారం ఘనంగా జరగనుంది. దీనిలో భాగంగా వినుకొండ మున్సిపల్ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మంగళవారం కొండపై జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  సుమారు 40 వేల వరకు భక్తులు పైకొండకు వచ్చే అవకాశం ఉందని భావించి భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. దేవాలయం నిర్మాణంలో ఉండడం వలన బాలాలయంలో, ఉత్సవ విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఘాట్ రోడ్డుకు బారి గేట్స్, కొండపై ఆలయం వద్ద క్యూలైన్లు, ఆర్టీసీ బస్సు సౌకర్యం  ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు, స్వచ్ఛంద సేవా సంస్థలు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారని వివరించారు.

శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్న కొండపై భక్తులకు అన్నప్రసాదాలు, మంచినీటి స్టాల్స్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. కొండపై టాయిలెట్స్, మెడికల్ క్యాంపులు అధికారులు ఏర్పాటు చేశారని తెలిపారు. తొలి ఏకాదశి పండుగ సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలు దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే హిమాలయ గురుజి బుధవారం సాయంత్రం 6:30 గంటలకు అఖండ జ్యోతి కార్యక్రమం నిర్వహిస్తారని, భక్తులు వేలాదిగా హాజరై అఖండ జ్యోతి దర్శించుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, తెదేపా నాయకులు, అధికారులు పాల్గొన్నారు.